కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం మాత్రమే కాక.. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఈ చిత్రంలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నారికి కూడా నంది అవార్డు వచ్చింది. మరి ఇప్పుడా చిన్నారి ఏం చేస్తున్నాడు అంటే..
అంతఃపురం సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఓ క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో.. సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాక.. అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు గాను.. కృష్ణవంశీకి ఉత్తమ దర్శకుడిగా, హీరోయిన్ సౌందర్యకు బెస్ట్ యాక్ట్రస్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. అంతేకాక ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఈ సినిమా జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటింది. అంతఃపురం సినిమాలో నటనకుగాను సౌందర్యకు స్పెషల్ జ్యూరీ అవార్డు, జగపతిబాబుకు ఉత్తమ సహాయ నటుడిగా.. ప్రకాశ్‌రాజ్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులో సైతం ఈ చిత్రం సత్తా చాటింది.
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఆఖరికి ఈ సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన రెండేళ్ల పిల్లాడు కూడా తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు. ఈ పిల్లాడు.. సినిమా మొత్తం సౌందర్య పక్కనే కనిపిస్తాడు. అంతఃపురం చిత్రంలో నటించే సమయానికి ఆ బాబుకి రెండేళ్ళు. ఈ సినిమాలో ముఖ్యంగా సౌందర్య స్పృహ తప్పి పడిపోయినపుడు కర్చీఫ్ తీసుకుని దాన్ని తడిపి తన తల్లి కన్నీళ్లు తుడిచే సన్నివేశంలో ఆ చిన్నారి తన యాక్టింగ్‌తో అందరిని ఏడిపించాడు. అంత చిన్న వయసులోనే తన నటనతో అందరిని ఏడిపించి.. అవార్డు అందుకున్న ఆ చిన్న బాబు పేరు కృష్ణ ప్రదీప్. రెండేళ్ల వయసులోనే తన అద్భుత నటనతో ఆకట్టుకున్న కృష్ణ ప్రదీప్ అంతఃపురం సినిమా తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు.
అందుకు కారణం అతడి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం. చదువు దెబ్బతినకూడదని భావించిన కృష్ణ ప్రదీప్ తల్లిదండ్రులు.. సినిమాలకు దూరం ఉంచారు. అంతఃపురం సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు. అంటే ప్రస్తుతం కృష్ణ ప్రదీప్ వయసు 27 ఏళ్ళు. చదువు పూర్తి చేసుకుని.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్న కృష్ణ ప్రదీప్.. సినిమా హీరోలకు ధీటుగా.. మంచి ఫిజిక్‌తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు కృష్ణ ప్రదీప్. ఇక తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కృష్ణవంశే తనకు గురువు అంటున్నాడు. మరి కృష్ణ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చే రోజు ఎప్పుడో చూడాలి.