Vishal: హీరో విశాల్ అంటే తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. తెలుగువాడైనా తమిళంలో సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయ్యాడు. తన సినిమాలు తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ కూడా ప్రేక్షకాదరణ పొందాడు. విశాల్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కోర్టు, కేసులు అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. లైకా ప్రొడక్షన్ దగ్గర తీసుకున్న 21 కోట్ల రూపాయల అప్పు ఆయన్ని నీడలా వెండాడుతోంది. ‘వీరమే వాగై సూడుమ్’ సినిమా టైంలో విశాల్ లైకా ప్రొడక్షన్ దగ్గర 21 కోట్ల రూపాయలు అప్పుతీసుకున్నారు. సదరు సినిమా రైట్స్ లైకా ప్రొడక్షన్‌కు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. అయితే, విశాల్ తన సినిమా రైట్స్‌ను లైకాకు ఇవ్వలేదు.
దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది. 6 నెలల్లో 15 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు విశాల్‌ను ఆదేశించింది. అయితే, విశాల్ డబ్బులు కట్టలేదు. దీంతో లైకా ప్రొడక్షన్ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు విశాల్ శుక్రవారం కోర్టు ముందుకు వచ్చారు. ఎందుకు తమ ఆదేశాలను పట్టించుకోలేదని విచారణ సందర్భంగా కోర్టు విశాల్‌ను అడిగింది. తనకు ఒక్క రోజులో 18 కోట్ల నష్టం వచ్చిందని, ఆ అప్పులు తీరుస్తూ ఉన్నానని చెప్పాడు. మరో ఆరు నెలలు అయినా కూడా డబ్బులు కట్టలేనని స్పష్టం చేశాడు. దీనిపై లైకా ప్రొడక్షన్ తరపు న్యాయవాది స్పందిస్తూ..
విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని, డబ్బులు కట్టే స్థోమత ఉందని పేర్కొన్నాడు. అప్పుడు కోర్టు ‘‘విశాల్ మీ సినిమా కెరీర్ ఆగిపోయిందా?’’ అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా విశాల్ ‘‘ నేను అప్పులు కట్టడానికే సినిమాలు చేస్తున్నా. సినిమాలు విడుదల చేద్దామనుకున్న ప్రతీసారి లైకా ప్రొడక్షన్స్ నన్ను కోర్టుకు తీసుకువస్తోంది’’ అని తెలిపాడు. దానికి లైకా తరపు న్యాయవాది ‘‘ విశాల్ మంచి సినిమాలు చేస్తున్నాడు. బాగా ఆస్తులు కూడా ఉన్నాయి’’ అని అన్నాడు. దానికి విశాల్ ‘‘ నాకు ఎలాంటి ఆస్తులు లేవు’’ అని చెప్పాడు. దానికి కోర్టు ‘‘ నీ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సెప్టెంబర్ 9లోగా ఫైల్ చెయ్యి’’ అని విశాల్‌ను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి : టికెట్ రేట్స్, థియేటర్ల మెయింటైనెన్స్ పై సీనియర్ నటుడు నరేష్ ఫైర్!