కేజీఎఫ్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన వెంకటేష్ మహా.. తాను తలచుకుంటే కేజీఎఫ్ ని మించిన సినిమా తీయగలను అంటూ కామెంట్స్ చేశారు.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన వెంకటేష్ మహా వివాదానికి తెర తీశారు. ఇన్ని రోజులూ పక్క పరిశ్రమ నటుల వల్ల మన తెలుగు నటులకు అవకాశాలు రావడం లేదని మన తెలుగు వారు ఆవేదన చెందేవారు. అయితే ఈ పరిస్థితి దర్శకులకు కూడా ఉంటుందని ఇవాళే తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా కేజీఎఫ్ సినిమాపై పరోక్షంగా దారుణ వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ ని గొప్ప సినిమా అనుకుంటున్నారు గానీ అసలు ఆ సినిమాలో అంత దమ్ము లేదని.. ఆ మాటకొస్తే సినిమాలో నీతి లేదు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కమర్షియల్ సినిమాలు తీస్తే.. కేజీఎఫ్ ని మించిన సినిమాలు చేయగలమని.. కానీ కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి ఆగిపోతున్నామని అన్నారు. అసలేం జరిగిందంటే?
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. కేజీఎఫ్ సినిమాపై పరోక్షంగా చురకలు అంటించారు. ఆడియన్స్ లో మాకున్న క్రెడిబిలిటీకి, మాలానే సినిమాలు తీసే దర్శకులకు ఉన్న క్రెడిబిలిటీకి.. మేము గనుక పొద్దున్న వెళ్లి ఇదంతా లేదు, ఈ అభ్యుదయవాదం లేదు. వంకాయ లేదు. కాన్షియస్ నెస్ లేదు. పక్కన పెట్టు. ఆ సినిమా చూస్తున్నారు. రేపొద్దున్న మేము పెన్ను బదులు కత్తి పట్టుకుంటే వాళ్ళ బాబులా తీస్తాం. మాకున్న ఏస్తెటికల్ సెన్స్ కి వాళ్ళ బాబులాగా తీస్తాం. వైలెన్స్, ఏదైనా గానీ చేయగలం. దాన్ని కూడా చాలా అందంగా చూపించగల శక్తి మాకు ఉంది.
కానీ మేము కాన్షియస్ గా ఆ పని చేయడం లేదు. అందుకనే లోకువైపోతున్నాం. మాకు విలువలు ఉన్నాయి. సమాజం పట్ల కాన్షియస్ నెస్ ఉంది. అందుకే చేయడం లేదు. అలా చేస్తే విలువ తగ్గిపోతుంది. కానీ చేయకపోవడం వల్ల లోకువగా చూస్తున్నారు అంటూ ఆవేదన వెళ్లగక్కారు. సమాజాన్ని చెడు వైపు తీసుకెళ్లే కమర్షియల్ సినిమాలు తీయలేక కాదు, మాకున్న అభ్యుదయ భావాలు అడ్డు వస్తున్నాయి. సామాజిక స్పృహ లేకుండా తీస్తే సమాజం నాశనం అవ్వడం తప్ప ఉపయోగం ఏముంది అనేలా ఆయన కామెంట్స్ చేశారు. మేము మాకున్న అభ్యుదయ భావాలను పక్కన పెట్టి తీయాలి అనుకుంటే కేజీఎఫ్ కాదు, దాని బాబు లాంటి సినిమా తీయగలం అని అన్నారు.
మేము విలువలతో కూడిన సినిమాలు చేస్తుంటే డీగ్రేడ్ చేస్తున్నారని, ఓటీటీ సినిమాలు అని చులకన చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇవాళ కేజీఎఫ్ గొప్ప సినిమా అంటున్నారు. అందులో గొప్ప ఏముంది అసలు? గోల్డ్ స్మగ్లర్ ని హీరోగా చూపించడం ఏంటి అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి తాము తలచుకుంటే కేజీఎఫ్ లాంటి కమర్షియల్ సినిమాలు తీయగలం గానీ సామాజిక స్పృహ కారణంగా ఆగిపోతున్నామని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. నిజంగా గొప్ప కమర్షియల్ సినిమా తీయాలి అనుకుంటే కేజీఎఫ్ దాకా ఎందుకు? ఆర్ఆర్ఆర్ లాంటి కథలు కూడా తీయచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వెంకటేష్ మహా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.