తెలుగు బుల్లితెర పై మోస్ట్ పాపులర్ డాన్స్ షో ఢీ. ఇప్పటివరకు విజయవంతంగా 13 సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ షో.. ప్రస్తుతం ‘డాన్సింగ్ ఐకాన్’ అంటూ 14వ సీజన్ కొనసాగుతోంది. అయితే.. ఇదివరకు డాన్స్ వరకే పరిమితమైన ఢీ షోలో వినోదం కోసం యాజమాన్యం.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, బిగ్ బాస్ అఖిల్ లాంటి వాళ్లను టీమ్ లీడర్లుగా నియమించింది. యాంకర్ గా ప్రదీప్ ఉన్నప్పటికీ హైపర్ ఆదిదే హవా ఉంటుంది.
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఏ షోలో అయినా లేడీ యాంకర్ లతో, జడ్జిలతో ఇట్టే పులిహోర కలిపేస్తుంటాడని టాక్ ఉంది. ఇంకా ఢీలో జడ్జి ప్రియమణితో ఆది పులిహోర మాములుగా ఉండదు. ఏకంగా బావ అని పిలిపించుకొని సంబరపడిపోతుంటాడు. అయితే.. లేటెస్ట్ ప్రోమోలో జడ్జిలుగా ప్రియమణితో పాటు జానీ మాస్టర్, హీరోయిన్ నందితా శ్వేత కనిపిస్తున్నారు. ఎప్పట్లాగే ఆది ప్రియమణితో పాటు కొత్తగా వచ్చిన నందితాతో పులిహోర కలిపి హగ్ తీసుకునే ప్రయత్నం చేశాడు.
జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ ఊరుకుంటాడా.. హైపర్ ఆది అనడమే ఆలస్యం వెంటనే అటు ప్రియమణిని, ఇటు నందితాని హగ్ చేసుకున్నాడు. ఇక అసూయతో ఆగలేక ఆది.. ‘మాకు చలిపెడితే మీరు మంటేసుకుంటున్నారు..’, ‘మా పేరు చెప్పుకొని ఎన్ని హగ్స్ తీసుకుంటున్నావ్ సామీ’ అంటూ జానీ పై పంచులతో రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.