పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించి అజ్ఞాతవాసి చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ రాజకీయాల్లోకి వెళ్లడం, జనసేన పార్టీ తరుపున పోటీలో నిలబడి ఓడిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ గా తెలుగు లో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తానికి వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా ఏంటో నిరూపించారు పవన్. ప్రస్తుతం ఆయన వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా పవన్ – సాగర్ చంద్ర కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ సినిమా రూపొందుతోంది. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో, రానా ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ టీజర్ విడుదలై అదరగొట్టింది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కి సిద్దం గా ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో సెన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.