పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో డిసెంబర్ 29న తెలిసింది. ఏ హీరో షో కోసం ఇంతలా ఎదురుచూడలేదు అభిమానులు. ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వెళ్తున్నారని తెలియగానే ఆ షో ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూశారు. ఆహా నిర్వాహకులు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందే ప్రసారం చేద్దామని అనుకున్నారు. కానీ సర్వర్లు డౌన్ అయిపోయాయి. మరి ప్రపంచమంతా అభిమానులు ఉంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ అవ్వకుండా ఉంటుందా? మొత్తానికి అన్ని అవాంతరాలు దాటుకుని బాహుబలి ఎపిసోడ్ ప్రసారమైంది. బాలకృష్ణతో బాహుబలి ఎపిసోడ్ అన్ స్టాపబుల్ ఎనర్జీని ఇచ్చింది ఫ్యాన్స్ కి. ప్రభాస్ గురించి ఒక చక్కని ఇంట్రో ఇచ్చి.. ఏవీ ప్లే చేసి మరీ డార్లింగ్ ని ఆహ్వానించారు బాలకృష్ణ.
అభిమానుల మాటలను ఏవీలో పెట్టడం బాగుంది. ఇక డార్లింగ్ ఎంట్రీతో షోలో ఉన్న వాళ్ళందరూ జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. ప్రభాస్ నామధేయస్య అంటూ స్వాగతం చెప్పిన బాలకృష్ణ.. డార్లింగ్ తో డార్లింగ్ అని పిలిపించుకున్నారు. ‘నీ సైజ్ కి రెడీమేడ్ దుస్తులు దొరుకుతాయా? డిజైనర్ తో సెపరేట్ గా కుట్టిస్తావా?’ అని బాలయ్య అడిగితే.. ‘బట్టలు నా ఫ్రెండ్ కుడతాడు సార్.. కానీ షూస్ తోనే పెద్ద సమస్య. నా షూ సైజ్ 12.5’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు ప్రభాస్. ఇక తన చేయి చూసి భవిష్యత్తు చెప్పమంటే.. ఇంకో పదేళ్లు అన్ స్టాపబుల్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు అడవులన్నా, జంతువులన్నా బాగా ఇష్టమని, ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుంటానని అన్నారు. ప్రభాస్ నటించిన సినిమాల్లోని డైలాగులు ప్లే చేయించి.. ఆ సినిమా పేర్లు చెప్పమన్నారు బాలయ్య.
ప్రభాస్ ఆ డైలాగులు విన్న వెంటనే టక్కున చెప్పేసేవారు. వర్షం సినిమా దర్శకుడు శోభన్ చనిపోయిన సమయంలో.. శోభన్ కుటుంబ సభ్యులకు ప్రభాస్ అండగా నిలిచిన విషయాన్ని బాలకృష్ణ గుర్తుచేశారు. ఆ సమయంలో శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కి ధైర్యం చెప్పి.. ట్రైనింగ్ ఇచ్చి.. హీరో అయ్యేలా కృషి చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభాస్ ని సరదాగా ఆటపట్టించడం.. ఇలా సరదా సరదాగా సాగింది ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో బాగా హైలైట్ అయిన అంశం ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ సిగ్గుపడిపోయారు. పెళ్లి ఉందా లేదా అని అడిగితే.. ‘ఏమో తెలియదు’ అంటూ కన్ఫ్యూజ్ చేసేసారు. ఇక బాలకృష్ణ చరణ్ కి కాల్ చేయగా.. చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు.
త్వరలోనే ప్రభాస్ శుభవార్త చెబుతాడంటూ చరణ్ అన్నారు. ప్రభాస్ వెంటనే.. ‘రేయ్ చరణూ నువ్వు నా ఫ్రెండ్ వేనా అసలు. చెప్పేది ఏమైనా ఉంటే క్లియర్ గా చెప్పరా’ అని ప్రభాస్ అన్నారు. ఫోన్ కట్ చేసే సమయంలో చరణ్.. ‘ఇదంతా డ్రామా’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లిపై మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. బాలకృష్ణ కూడా ప్రభాస్ పెళ్లి విషయాన్ని చెప్పించడంలో ఫెయిలయ్యారు. హీరోల దగ్గర నుంచి అన్ని మేటర్లు లాక్కునే బాలయ్య.. ప్రభాస్ పెళ్లి మేటర్ ని మాత్రం లాగలేకపోయారు. రెండవ ఎపిసోడ్ లో అయినా లాగుతారేమో చూడాలి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్న ఎంతలా వెంటాడిందో. ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా ‘డార్లింగ్ పెళ్ళెప్పుడు’ అనే ప్రశ్న ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని, సినీ లోకాన్ని వెంటాడుతోంది. మరి ప్రభాస్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ ఎపిసోడ్ లో మీకు నచ్చిన అంశాలు ఏమిటో కామెంట్ చేయండి.