ప్రాజెక్ట్ కేకు సంబంధించి శనివారం ఓ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్‌లో ఓ పెద్ద చెయ్యి దర్శనిమిచ్చింది. గతంలో విడుదలైన సగానికి పైగా ప్రాజెక్ట్ కే పోస్టర్లలో చెయ్యి ఉండటం ఓ కొత్త ప్రచారానికి తెర తీసింది. దేవుడు వర్సెస్ సైన్స్‌గా కథ ఉండనుందని తెలుస్తోంది.
ప్రాజెక్ట్ కే.. ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకుడు కూడా సంతోషపడిపోతున్నారు. ప్రాజెక్ట్ కే నుంచి ఇప్పటివరకు దాదాపు ఓ ఐదు పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ ఐదిటిలో సగం పోస్టర్లు చెయ్యికి సంబంధించినవి కావటం విశేషం. తాజాగా, సినిమా టీం నుంచి వచ్చిన అప్‌డేట్‌లోనూ చెయ్యి ఉంది. ఈ చేతులకు సినిమా కథకు ఏదో లింక్ ఉందని అందరూ భావిస్తున్నారు. మొదట నుంచి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అన్న ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు! టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఉండనుందని కూడా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా సైన్స్‌తో పాటు దేవుడి గురించి కూడా చెప్పబోతోందని ప్రచారం నడుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఈ సినిమా షూటింగ్ నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలోని గుడిలో జరిగింది. పెన్నా తీరంలో ఇసుక తిన్నెల వద్ద ఉన్న పురాతన గుడిలో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. దీంతో సైన్స్ ఫిక్షన్ సినిమాకు దేవుడికి సంబంధం ఏంటన్న ప్రశ్న మొదలైంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను దేవుడు వర్సెస్ సైన్స్‌గా తెరకెక్కించనున్నారట.
నాగ్ అశ్విన్ మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’లో దేవుడికి సంబంధించిన పాయింట్ ఉంటుంది. ఈ సినిమా ‘దూద్ కాశీ’ యాత్ర నేపథ్యంలో కీలక మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కేకు సంబంధించిన పోస్టర్‌లో ఓ పెద్ద చెయ్యి కనిపిస్తుంది. ఈ చెయ్యి కూడా దేవుడిది అయి ఉండే అవకాశం లేకపోలేదు. మన పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగాలలో మనుషులు చాలా పెద్దగా ఉండేవారు. ప్రతి ఒక్కరు దాదాపు 9 అడుగులపైనే ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పోస్టర్‌లో పెద్ద చెయ్యి చూపించటం మన పురాణాలతో కథను ముడిపెట్టడమే అని చెప్పుకోవచ్చు. భారత దేశానికి సైన్స్ కొత్తేమీ కాదు.. కొన్ని వేల ఏళ్ల క్రితమే బ్రహ్మాండమైన సైన్స్ అందుబాటులో ఉండేది. శస్త్ర చికిత్స దగ్గరినుంచి ప్రపంచాన్ని నాశనం చేసే అణ్వాయుధాల వరకు అన్నీ దేశంలో అందుబాటులో ఉండేవి.
కాల క్రమంలో వాటి ఫార్ములాలు కనుమరుగయ్యాయి. కానీ, వాటి ప్రభావం మాత్రం ఇంకా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ టైమ్ ట్రావెల్ ద్వారా వేల ఏళ్ల క్రితానికి మనల్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. నేటి ప్రపంచంలో సైన్స్ ద్వారా ఎదురయ్యే సమస్యకు.. గతంలోని సైన్స్ పరిష్కారం చూపే అవకాశం ఉంది. నేరుగా దేవుడే ఓ పరిష్కారాన్ని చూపించొచ్చు. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలే. వీటిలో వాస్తవం ఎంతుందో సినిమా విడుదల అయితే కానీ, తెలీదు. ఒక వేళ ఇదే గనుక నిజం అయితే, ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా కాదు.. ప్యాన్ యూనివర్స్ సినిమా అవుతుంది. మరి, ప్రాజెక్ట్ కే సినిమాపై మీ ఊహల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023