గురువారం రోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీనియర్ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈ రోజు తన అభిమాని పుట్టినరోజు కావడంంతో అభిమానులతో, స్నేహితులతో శ్రీవారిని దర్శించుకున్నారు.
గురువారం ఉదయం తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో సుమన్ 45 సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించారు. తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్‌ది ఈ రోజు బర్త్‌డే. ఈ సందర్భంగా నారాయణ గౌడ్‌తో కలిసి హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం సుమన్‌కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తన అభిమాని పుట్టినరోజును సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానని హీరో సుమన్ చెప్పారు. తాను నటించిన కన్నడ సినిమా ‘బేరే’ ఈ నెల 16న విడుదల కానుందని, ‘బేరే’ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నానని ఆయన తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మనుషులందరు కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ సినిమా యెుక్క సందేశం అని అన్నారు. అభిమానులు దొరకడం అరుదైన విషయమని.. అది దేవుడిచ్చిన వరం అని అన్నారు. అభిమానులు తమ హీరో, హీరోయిన్‌ను దేవుళ్లలా పూజిస్తారని ఆయన చెప్పారు. తనకు ఇంత ఇమేజ్ క్రియేట్ చేసిన అభిమానులకు, దర్శకులకు, నిర్మాతలకు పాదాభివందనాలు తెలుపుతున్నానని అన్నారు.
‘చెంగప్ప’ అనే తెలుగు మూవీ షూటింగ్ జరుగుతోందని, తాను ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని తెలిపారు. ‘సిద్ధన్నగట్టు’ అనే ఫ్యాక్షన్ మూవీ కర్నూలులో షూటింగ్ జరుతున్నట్లు వెల్లడించారు.
అంతకు ముందు వెంకటేశ్వరస్వామి మీద తనకు అంత భక్తీ, నమ్మకం ఉండేదికాదని, అన్నమయ్య సినిమా తర్వాత పెరిగిన ఇమేజ్‌తో స్వామివారిపై నమ్మకం కుదిరిందని చెప్పుకొచ్చారు.
రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే విషయం ఇంకా ఆలోచించలేదని.. ప్రస్తుతానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌కే తన ఫుల్ సపోర్ట్ అని అన్నారు. కేసీఆర్‌పై తనకు చాలా అభిమానం ఉన్నట్లు తెలిపారు.