టాలీవుడ్ యువనటుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ శర్వానంద్ వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ సిల్వర్ స్పూన్ హీరో ఇప్పుడు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే చర్చలు నడుస్తున్నా.. ఇప్పుడు ఆ విషయం కొలిక్కి వచ్చింది. శర్వానంద్ మనువాడనున్న వధువు వివరాలు బహిర్గతమయ్యాయి. అమ్మాయి.. రెడ్డి సామజిక వర్గానికి చెందినది. పేరు.. రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
రక్షిత రెడ్డి.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు.. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా వధువు.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. ఈనెల 26న వీరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరి నిశ్చితార్థం హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.
శర్వాది ప్రేమ వివాహం అంటూ ముందు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే అని తెలుస్తోంది. ఏదేమైనా.. ‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నకు శర్వానంద్ త్వరగానే సమాధానం ఇచ్చేస్తున్నారు. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ‘మహానుభావుడు’ తరవాత మళ్లీ ఆ స్థాయి విజయం శర్వానంద్‌కు దక్కలేదు. గతేడాది వచ్చిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతానికి శర్వానంద్.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు గుసగుసలు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన ప్రేమ వ్యవహారాలకు.. పెళ్లి వ్యవహారాలకు సోషల్ మీడియాలో ఉన్న డిమాండ్ తెలిసిందే కదా. అందుకే ఈ ఈ వివరాలు మీకందిస్తున్నాం.. శర్వానంద్ పెళ్లిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.