ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువయిపోయాయి. తాజాగా, ప్రముఖ ఫైట్ మాస్టర్ సురేష్.. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. భారీ క్రేన్ నుంచి ఆయన కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఈ విషయం సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఈ ఘటన మరువకే ముందే మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సీనియర్ కన్నడ నటుడు మన్‌దీప్ రాయ్ గుండెపోటుకు గురయ్యారు.
దీంతో ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స అందుతోంది. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చేయించుకోవటానికి కూడా డబ్బులు కరువయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఆయన చికిత్స కోసం ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మన్‌దీప్ రాయ్ గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నారన్న వార్త తెలియగానే..
ఆయనను అభిమానించే వారు ఆందోళన చెందుతున్నారు. మన్‌దీప్ త్వరగా కోలుకోవాలని మళ్లీ సినిమాల్లో నటించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. కాగా, మన్‌దీప్ రాయ్ 1980లో వచ్చిన ‘‘మించిన ఒట’’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. హాస్య నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 500లకు పైగా సినిమాల్లో నటించారు. 1980నుంచి 2022 మధ్యకాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలోని అందరు స్టార్ హీరోలతో ఆయన కలిసి పనిచేశారు.