టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థత గురయ్యారు. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేసి.. నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత రెండు రోజుల నుంచి నాగశౌర్య వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈక్రమంలో సోమవారం కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో కొంత ఎక్కువ స్ట్రెస్ కి గురవడం వల్ల నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన మూవీ యూనిట్.. నాగశౌర్యను వెంటనే గచ్చిబౌలి లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవలే నాగశౌర్య త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి తో నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ డిసెంబర్ 20న బెంగళూరులోని ఓ హోటల్ లో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ఈ నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది. పెళ్లి పనుల్లో ఆయన కుటుంబ సభ్యులు ఫుల్ బిజీగా ఉన్నారు. శుభలేఖలు కూడా పంచుతున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలో నటించి.. అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా నిలిచాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, చలో వంటి పలు సినిమాల్లో నటించి.. అమ్మాయిల మనస్సు దోచుకున్నాడు. ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం నాగశౌర్య అస్వస్థతకి గురయ్యాడు.