జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో స్వతహాగా పైకొచ్చినటువంటి హీరో. టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో తనను తాను నిరూపించుకున్న హీరో. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. వరుస పెట్టి నటనతో దండయాత్ర చేస్తూ బాక్సాఫీస్ కా బాప్, మాస్ కా బాప్ అనిపించుకున్న అసలు సిసలు మాస్ హీరో ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోలేదని ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ కి సక్సెస్ వచ్చిన తర్వాత తారక్ ని తమలో ఒకడిగా కలుపుకున్నారని ఇప్పటికీ ప్రచారం చేస్తారు. ముఖ్యంగా హరికృష్ణ అసలు ఎన్టీఆర్ ని పట్టించుకోలేదని కొంతమంది పనిగట్టుకుని మరీ ప్రచారం చేశారు, చేస్తున్నారు. అయితే వీళ్ళకి తెలియనిది ఏంటంటే.. హరికృష్ణ ఏనాడూ ఎన్టీఆర్ ని పట్టించుకోకుండా లేరు.
ఎన్టీఆర్ ని ఎవరూ పట్టించుకోలేదు అని ప్రచారం చేసే వారికి సమాధానమే ఈ ఫోటో. నవంబర్ 1 2002లో విడుదలైన శివరామరాజు సినిమా ఆడియో ఫంక్షన్ లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటో, ఎన్టీఆర్ గురించి తొలిసారిగా భావోద్వేగంతో మాట్లాడిన హరికృష్ణ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధానికి వేదికైన శివరామరాజు ఆడియో క్యాసెట్ ఫంక్షన్ లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. శివరామరాజు సినిమాలో హరికృష్ణ, జగపతిబాబు, వెంకట్, శివాజీ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఆడియో క్యాసెట్ విడుదల ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా తారక్ వెళ్లారు.
హరికృష్ణ క్యాసెట్ లను ఆవిష్కరించగా.. తొలి క్యాసెట్ ను తారక్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తండ్రీ, కొడుకులిద్దరూ దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్న దృశ్యం అప్పట్లో అక్కడకు విచ్చేసిన వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సుందర దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించాలని ఫోటోగ్రాఫర్లు ఎగబడితే.. చిరునవ్వుతో ఫోటోలకి ఫోజులిచ్చారు తండ్రీ, కొడుకులు. ఇక శివరామరాజు సినిమా గురించి మాట్లాడిన హరికృష్ణ.. తన వ్యక్తిగత జీవితం గురించి మొదటిసారిగా మాట్లాడారు. మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని దర్శక, నిర్మాతలను అడగడంతో సభలో ఉన్న అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వారి అనుమతితో హరికృష్ణ.. తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.
నాకెప్పుడూ ఒక విషయం పట్ల ఒకింత సందిగ్ధత ఉంటూనే ఉంటుంది. అది ఓ సంబోధన విషయంలోనే. అదే తారక్ ని ఎలా పిలవాలి? అనే విషయంలోనే. ఇప్పుడు నేను తారక్ గురించి కొంత చెప్పాలి. తారక్ పుట్టినప్పుడు తన పేరు ‘త’ అక్షరంతో పార్రంభం అయ్యేలా ఉండాలని అన్నారు. అప్పుడు మా చిన్నాన్న త్రివిక్రమరావు గారు తారక్ రామ్ అని పెట్టమని చెప్పారు. అలా తన పేరు తారక రామారావు అయ్యింది. అయితే ఇంతకాలం తారక్ ని మేమెవరం పట్టించుకోవడం లేదని, ఏకాకిని చేశామని రకరకాల పుకార్లు పుట్టించారు. అదంతా అబద్ధం. ఎవరికి వారు స్వయంశక్తితో ఎదగాలి. ఏ విషయం నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. మా తండ్రి రామారావు గారిని పరిశ్రమకు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వెన్ను తట్టి నడిపించారు? ఎవరి సహాయ సహకారాలతో పైకి వచ్చారు? ఒంటరిగానే వచ్చారు. ఒంటరిగానే పోరాటం చేశారు.
బాలకృష్ణ హీరోగా ఎలా ఎదిగారు? మా నాన్న గారు ఎప్పుడైనా నా బిడ్డను పైకి తీసుకురమ్మని ఆంధ్ర దేశ ప్రజలను కోరారా? లేదే. నా విషయమే తీసుకుంటే నాన్న గారికి డ్రైవర్ గా పని చేశాను. మా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ కూడా రీఫ్ కంట్రోలర్ గానే పేరు వేసుకున్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేనూ పైకి వచ్చాను. కాబట్టి ఎవరికి వాళ్లే పైకి రావాలి. అలా కాకుండా అనుక్షణం వారిని గమనిస్తూ.. సలహాలు ఇస్తూ పోతే ఎప్పటికీ పైకి రారు. అలా అనుక్షణం అండదండలు అందిస్తే వారిని నాశనం చేస్తున్నట్లే అని నా భావన. ఈరోజు తారక్ స్వయంశక్తితో పైకి వస్తుంటే చూస్తూ ఆనందించడంలో తండ్రిగా ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను.
మా కుటుంబం యావత్తూ కళకే అంకితం. కాబట్టి ఎవరైనా హీరోలుగా రావచ్చు. రేపు నా రెండో కుమారుడు కళ్యాణ్ రామ్ హీరోగా రావచ్చు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరో కావచ్చు. రామకృష్ణ కొడుకు హీరోగా రావచ్చు. ఇప్పటికే తారక రత్న హీరోగా వచ్చాడు. ఎవరు వచ్చినా అంతిమ తీర్పు ప్రజలదే. ఎవరికి ఎవరూ పోటీ కాదు. ఎవరు వచ్చినా కళకు అంకితమై చేయాలి. అప్పుడే వారిని ప్రజలు ఆదరించి, ఆశీర్వదిస్తారు. తారక్ మొదటి సినిమా నిన్ను చూడాలని కథ మాత్రమే విన్నాను. ఆ తర్వాత పట్టించుకోలేదు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకునే శక్తి రావాలనే అలా చేశాను. రేపు కళ్యాణ్ రామ్ విషయంలో అయినా అంతే. మొదటి సినిమా వరకే నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆ తర్వాత తనకు తానుగానే ఎదగాలి.
ఎన్టీఆర్ కి మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను’ అని హరికృష్ణ అన్నారు. హరికృష్ణ మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ వినమ్రంగా ఉండిపోయారట. జగపతిబాబు తండ్రీ, కొడుకులిద్దరినీ కలిపి ఒకే గజమాలతో సత్కరించడం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇలా తన కొడుకు ఎన్టీఆర్ ని, తనను వేరు చేసి మాట్లాడుతున్న అప్పటి రూమర్ రాయుళ్ళకి ఈ ఒక్క స్పీచ్ తో సమాధానం చెప్పారు హరికృష్ణ. మరి ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం వదిలేసింది, పట్టించుకోలేదని వాగే బ్యాచ్ ఇప్పటికైనా నిజాలు తెలుసుకుంటే మంచిది. ఈ ఒక్క ఫోటో చాలదా? వారు ఎంత బాగా కలిసున్నారో చెప్పడానికి.