గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీలో పలువురు నటులు.. ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారు కన్నుముశారు. మరికొంత మంది ఇతర కారణాల వల్ల చనిపోయారు. తాజాగా హాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రస్ట్’ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. శాంటా ఫేకు దక్షిణాన ఉన్న ప్రముఖ నిర్మాణ ప్రదేశమైన బొనాంజా క్రీక్ రాంచ్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
న్యూ మెక్సికోలో అలెక్ బాల్డ్విన్‌పై సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో ఆయన ప్రాప్ గన్‌ని కాల్చారు. ఆ సమయంలో అనుకోని ప్రమాదం జరిగి సినిమాటోగ్రాఫర్ మృతిచెందారు. దర్శకుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయబడలేదు, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో అక్కడ ఉన్నవారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాలినా హచ్చిన్స్ ప్రమాదం జరిగిన వెంటనే అల్బుకెర్కీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు, కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.
దర్శకుడికి చిన్నపాటి గాయాలు కాగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. రిహార్సల్ సమయంలో తుపాకీ పేలినట్టుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రస్ట్ చిత్రం ఓ 13ఏళ్ల బాలుడు తన తాతతో కలిసి పరారీ నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీకి మిస్టర్ సౌజా దర్శకత్వం వహించారు .ఫ్రాన్సిస్ ఫిషర్ మరియు మిస్టర్ బాల్డ్విన్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.