ఒకప్పుడు సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే.. వార్త పేపర్లలో వాళ్ల గురించి రాస్తే చదివేవాళ్లం. ఆ చదివిందీ మిగతా వాళ్లతో చర్చించే వరకు నిద్రపోం. అయితే వాళ్ల గురించి వచ్చిన వాస్తవాల కన్నా, గాసిప్సే ఎక్కువ. ఆ వార్తలు వాస్తవమా, కాదా అని వారూ కూడా ఇప్పటిలా ప్రెస్ మీట్లు పెట్టి నివృత్తి చేసేవాళ్లు కాదు. అప్పట్లో షూటింగ్ లతో బిజీగా గడిపేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని స్వయంగా తారలే.. నెటిజన్లు, అభిమానులతో చాట్ చేస్తున్నారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. అలాగే చిన్ననాటి ఫోటోల నుండి షూటింగ్ లో జరుగుతున్న విషయాలను పంచుకుంటున్నారు. అలాంటిదే ఈ ఫోటో
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గమనించారా..? గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. చూస్తున్న ఈ చిన్నారి.. తెలుగు సినిమాల్లో టాప్ హీరోలతో నటించారు. ఇప్పటి తెలుగు స్టార్ హీరో సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లి.. సెలక్టు కాలేదని చెప్పి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు గుర్తు వచ్చారా.. ఆమెనే సమీరా రెడ్డి. ఆ స్టార్ హీరో మహేష్ బాబు. 1998లో మహేష్ బాబు సినిమా కోసం తొలిసారిగా తాను ఆడిషన్ కు వెళ్లి.. వాళ్లు ఇచ్చిన టాస్క్ సరిగా చేయక కన్నీళ్లతో ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఏదైతే అప్పటి వరకు జాబ్ చేశానో.. అదే కొనసాగించాలని భావించానన్నారు. త్వరాత ఓ ప్రైవేట్ ఆల్చమ్ లో అవకాశాలు రావడం. ఆ తర్వాత వెండితెరపై వెలగడం చక చకా జరిగిపోయాయి. అంతేకాకుండా ఆడిషన్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు.
సమీరా రెడ్డి.. ఈ ఫోటోలతో పాటు అంతక ముందు తన చిన్న నాటి ఫోటోలను కూడా ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. అందులో ఆమె ఎంతో బొద్దుగా కనిపిస్తున్నారు. ఇందులోనే తన చిన్ననాటి ఫోటోలన్నీ ఉన్నాయి. సమీరా తండ్రి తెలుగు వ్యక్తి. ముంబయిలో స్థిర పడ్డారు. ఆమె అక్కడే జన్మించింది. సమీరా తెలుగులో నరసింహుడుతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత చిరంజీవితో కలిసి జై చిరంజీవలో ఆడిపాడారు. అశోక్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన మరోసారి నటించారు. చివరగా.. కృష్ణం వందే జగద్గురుమ్ లో ఓ పాటలో కనిపించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమీరా.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫ్యామిలీ విషయాలు కూడా పంచుకుంటారు. 2014లో వ్యాపార వేత్తను వివాహం చేసుకున్న సమీరాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం సమీరా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆశిస్తున్నట్లయితే అభిప్రాయాలను తెలియజేయండి.