‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి ప్రేక్షకాభిమానాన్ని చూరగొని, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సౌందర్య. కర్ణాటక నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి అగ్రకథానాయికగా కొనసాగారామె.
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో కథానాయికలున్నారు. ఒక్కసారి సినిమా నచ్చితే, అందులోని హీరోయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఇంట్లో మనిషిలా ఓన్ చేసుకుంటారు టాలీవుడ్ ఆడియన్స్. అందులో ఇతర ప్రాంతాల నుండి వచ్చి, తెలుగునాట స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. వారిలో అందాల నటి సౌందర్య స్థానం ప్రత్యేకం. ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి ప్రేక్షకాభిమానాన్ని చూరగొని, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సౌందర్య. కర్ణాటక నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి అగ్రకథానాయికగా కొనసాగిన సౌందర్య.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించి మెప్పించారు. ఆమె అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి సౌందర్యగా ఎంట్రీ ఇచ్చారు.
ఎంబీబీఎస్ చదువుతుండగానే ‘గంధర్వ’ అనే కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన సౌందర్య.. అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, విష్ణు వర్థన్ వంటి టాప్ హీరోలతో జతకట్టారు. ‘అమ్మోరు’ వంటి భక్తిరస చిత్రం, ‘శ్వేతనాగు’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీతోనూ అలరించారు. పోస్టర్ మీద ఆమె బొమ్మ ఉంటే చాలు టికెట్లు తెగేవి. స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైంలో ఆలీ, బాబూ మోహన్ వంటి కమెడియన్లతో స్పెషల్ సాంగ్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
తన తరంలో 100 సినిమాలు పూర్తి చేసిన ఘనత సౌందర్యకే దక్కుతుంది. ఇక అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. అందమైన రూపం, సహజమైన నటన, చక్కని చిరునవ్వు ఆమెను ప్రేక్షకాభిమానులకు మరింత చేరువ చేశాయి. 1972 జూలై 18న సౌందర్య జన్మించారు. నేడు (జూలై 18) ఆమె జయంతి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ వారు, అభిమానులు, నెటిజన్లు సౌందర్య జయంతి శుభాకాంక్షలతో పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.