యాక్షన్ హీరో గోపీచంద్‌లో ఉన్న ప్రతిభను వెలికితీసింది దర్శకుడు తేజ అనే విషయం విదితమే. ‘జయం’, ‘నిజం’ లాంటి చిత్రాల్లో గోపీచంద్‌కు ఆయన మంచి అవకాశాలు ఇచ్చారు.
టాలీవుడ్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. యాక్షన్ స్టార్‌గా ఆయనకు ఆడియెన్స్‌లో మంచి పేరుంది. అయితే ఆయన మాస్ సినిమాలనే కాకుండా అన్ని తరహా మూవీస్ చేస్తుంటారు. ‘లక్ష్యం’ లాంటి ఫ్యామిలీ సినిమాతో పాటు ‘లౌక్యం’ లాంటి కామెడీ చిత్రాలు కూడా చేశారాయన. యాక్షన్ హీరోగా తనకు ఉన్న ఇమేజ్ను కాపాడుకుంటూనే కొత్తదనం ఉండే ఫిల్మ్స్ చేస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న గోపీచంద్.. తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాన్నాళ్లు అయ్యింది. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి బ్లాక్ బస్టర్స్‌ను తనకు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో ఆయన జట్టు కట్టారు.
గోపీచంద్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో జోరు పెంచారు గోపీచంద్. ఈ క్రమంలో సీనియర్ డైరెక్టర్ తేజతో కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తేజకు గోపీచంద్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో నెట్టింట రిలీజై వైరల్ అవుతోంది. ఇందులో ‘రామబాణం’ సినిమాతో పాటు తాము కలసి చేసిన సినిమాల గురించి కూడా గోపీచంద్-తేజ మాట్లాడుకుంటూ కనిపించారు. ‘రామబాణం’ చిత్రం పేరును నందమూరి నటసింహం బాలకృష్ణ అనౌన్స్ చేశారు.
ఈ నేపథ్యంలో బాలయ్యతో ఎందుకు అనౌన్స్ చేయించారని ఇంటర్వ్యూలో గోపీచంద్‌ను ప్రశ్నించారు తేజ. అలాగే తాము ఇద్దరూ కలసి చేయాల్సిన సినిమాలో హీరోయిన్ సెట్ కాలేదని ఆగిపోయిన సమయంలో.. గోపీచంద్ మరో ప్రాజెక్టును మొదలుపెట్టడం గురించి కూడా తేజ ప్రశ్నించారు. తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని గోపీచంద్‌పై ఆయన సీరియస్ అయ్యారు. దీనికి గోపీచంద్ స్పందిస్తూ.. తాను చేసింది తప్పేనన్నారు. గోపీచంద్‌ను మరో ఆసక్తికర క్వశ్చన్ అడిగారు తేజ. ‘మీ నాన్న గొప్పోడు. మరి నువ్వేం పీకావ్’ అంటూ ఆయన ప్రశ్నించారు. గోపీచంద్ కూడా తేజను ప్రశ్నించారు. సినిమాకు సినిమాకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నారని అడిగారు. దానికి తేజ.. ‘నేను ఎవర్నీ వెళ్లి సినిమా చేయాలని అడగను’ అని జవాబిచ్చారు. ఇకపోతే, గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గొప్ప డైరెక్టర్ అనే విషయం విదితమే. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను తీశారు.