టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నాగ్ కి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరి నాగ్ కి నోటీసులు జారీచేసింది ఎవరు? అనంటే.. విషయం తెలుగు రాష్ట్రాలలో కాదు. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి గోవాలో నాగార్జున ఇంటి నిర్మాణం ఏంటి? అక్కడి నుండి నాగ్ కి నోటీసులు రావడం ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున గోవాలోని మాండ్రేమ్ అనే గ్రామంలో ఓ అందమైన ఇంటిని నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఆ ఇంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. నాగార్జున ఇంటి నిర్మాణం అక్రమంగా జరుగుతోందని.. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులు పంపినట్లు సమాచారం. మాండ్రేమ్ గ్రామంలో నాగార్జున ఇంటికి సంబంధించి నిర్మాణ పనును ఆపాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఈ వార్త అక్కినేని అభిమానులకు తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇంతకీ మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులో పేర్కొన్న విషయం ఏంటంటే.. “మాండ్రేమ్ పంచాయతీ పరిధిలోని సర్వే నెం. 211/2బి అశ్వేవాడ.. ప్రాంతంలో ముందస్తు అనుమతులు లేకుండా మీకు సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ ఇంటికి సంబంధించి అన్ని నిర్మాణ పనులను వెంటనే ఆపకపోతే.. పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికైతే కింగ్ నాగ్.. ఇంకా ఈ నోటీసులపై స్పందించలేదు. సినీ రంగంలోనే కాకుండా పలు వ్యాపారాలలో కూడా నాగ్ రాణిస్తున్నారు. సో.. గోవాలో కూడా వ్యాపారాలు విస్తరించే ఆలోచనతో అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నారని టాక్. చూడాలి మరి ఈ నోటీసుల విషయమై నాగ్ ఎలా స్పందిస్తారో..!