సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో వారు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 22న మెగాస్టార్ తన 67వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని తారాస్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘ఘరానా మొగుడు’ సినిమాను ఈ నెల 22న మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు ఫ్యాన్స్. 30 ఏళ్ళ క్రితం విడుదలైన ఘరానా మొగుడు మూవీని సెలెక్టెడ్ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి మెగాస్టార్ స్వాగ్, యాటిట్యూడ్, డ్యాన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ చూడొచ్చని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ది గ్రేట్ రావుగోపాల రావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణీ సంగీతం అందించగా.. దేవివరప్రసాద్ సినిమాను నిర్మించారు. ఇక 1992లో ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ అవుతుందంటే మరి ఆగష్టు 22న మెగా ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో చూడాలి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్న చిరు.. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్, బాబీ దర్శకత్వంలో 154వ సినిమా చేస్తున్నారు. మొత్తానికి తదుపరి సినిమాల నుండి మెగాస్టార్ సందడి మొదలు కాబోతుంది. మరి ఘరానా మొగుడు రీరిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#GharanaMogudu arriving to theatres on this 22nd as BOSS birthday special pic.twitter.com/15juLeDtOn
— Thyview (@Thyview) August 13, 2022