గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతున్న పేరు ఇది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో గెటప్ శ్రీను పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందంటూ గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా గురించే కాకుండా జబర్దస్త్ లోకి సుధీర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా! అన్న విషయం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు దోచుకుని ప్రత్యేకమైనవి నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను, హైపర్ ఆది లాంటి ఎంతో మందిని నిలబెట్టింది. అయితే.. వీరిలో కొందరు వెండితెర అవకాశాలు రాగానే వీడుతున్నారు. అలా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుండి బయటకు వచ్చారు. అయితే అది పెద్దగా వర్కవుట్ కాలేదు. అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నిర్మాతలు కనిపించకుండా పోయారట. దీంతో సుధీర్ తిరిగి జబర్దస్త్ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని గెటప్ శ్రీను అంగీకరించనప్పటికీ, సుధీర్ రీఎంట్రీ ఇస్తాడు అన్నట్లుగా హింట్ ఇచ్చాడు. సుధీర్ కుర్చీ ఎప్పటికీ అలాగే ఉంటదని, తన రాక కోసం తాము ఎదురుచూస్తుంటామని తెలిపాడు.