గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పేరుకే హాలీవుడ్ షో అయినప్పటికి దీనికి ప్రపంచవ్యాపంగా అభిమానులు ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ షో అంటే విపరీతమైన అభిమానం. ఇక ఇందులో ప్రధాన పాత్ర డేనేరిస్ టార్గారియన్‌లో నటించిన ఎమీలియా క్లార్క్‌కి ఎందరో అభిమానులు ఉన్నారు. అందం, నటన ఇలా అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ మీద తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులని చేసే ఎమీలియా రియల్ లైఫ్‌లో పెను విషాదం ఉందనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది ఎమీలియా. దాని వల్ల ఆమె ఇప్పటికే రెండు సార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి వల్ల నిత్య జీవితంలో నరకం చూస్తున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..
ఎమీలియా ‘బ్రెయిన్ అనూరిజం’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. బ్రెయిన్ అనూరిజం అంటే.. మెదడులో కొంతభాగం పనిచేయదు. 2011లో ఒకసారి, 2013లో ఒకసారి ఆమె బ్రెయిన్ అనూరిజం సమస్యలకు గురైంది. దీన్ని బ్రె యిన్ స్ట్రోక్ అని కూడా పిలుచుకోవచ్చు . దీని వల్ల ఇప్పటికే ఆమె రెండు సార్లు చావు అంచుల దాకా వెళ్లి బయటికి వచ్చింది. చాలా సార్లు వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం జరిగేదని, వైద్యునికి దగ్గరికి వెళ్లాకే తనకున్న ప్రాణాంతక సమస్య గురించి తెలిసిందని చెబుతోంది ఎమీలియా. ఇప్పటికీ ఎమిలియా మెదడులో కొంతభాగం పనిచేయదు. మిగతా భాగం మెదడుతోన ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అంతే కాదు సినిమాలు చేస్తోంది. మెదడులో కొంత భాగం పనిచేయకపోవడం వల్ల సమస్యలు రావా.. అని అడిగితే ఎందుకు రావు, కచ్చితంగా వస్తాయి. అప్పుడప్పుడు మాటల్లో స్పష్టత రాదు, కొన్ని పనులు ఇతరుల్లా నేను చేయలేను. కానీ నా వరకు నేను సంతోషంగా ఉన్నాను అని వివరిస్తోంది.
ఏంటి బ్రెయిన్ అనూరిజం..
అనూరిజం అనేది మెదడు రక్తనాళాలైన ధమనులు ఉబ్బి బుడగలా ఏర్పడతాయి. రక్తనాళంలో ఏ మూలైనా ఇది ఏర్పడవచ్చు. ముఖ్యంగా రక్తనాళాలు శాఖలుగా విడిపోయిన చోట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెలూన్లలా ఉబ్బడాన్నే అనూరిజం అంటారు. ఇవి చాలా చిన్నవిగానే ఉన్నా సమస్య మాత్రం పెద్దదనే చెప్పాలి. ఎంతో ప్రమాదకరమైనవి కూడా. బెలూన్లలా ఉబ్బిన తరువాత అవి పేలి అంతర్గం రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఎమీలియాకు అంతర్గత రక్తస్రావం కూడా జరిగింది. ఈ ఆరోగ్యపరిస్థితి వచ్చినవారిలో బతికి బట్టకట్టేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మూడింట మందిలో ఒక వంతు మంది మాత్రమే కోలుకుంటారు.
లక్షణాలు..
మెదడు రక్త నాళాలో అనూరిజం మొదలైనా కూడా బయటికి కనిపించదు. అయితే తరచుగా కనిపించే కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
1. తీవ్రమైన తలనొప్పి
2. అప్పుడప్పుడు వచ్చి పోయే తలనొప్పులు
3. వాంతులు
4. పక్షవాతం
5. స్పృహ కోల్పోవడం
6. చూపుకు ఎదురుగా ఉన్న వస్తువులు రెండుగా కనిపించడం
7. కళ్ల వెనుక నొప్పి
బ్రెయిన్ అనూరిజం ఏర్పడటానికి సరైన కారణాలంటూ లేవు. వందమందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ధూమపానం చేసేవారికిలో, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో, ముఖ్యంగా మహిళల్లో, నలభై ఏళ్లు దాటిన వారిలో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు ‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్’సమస్య ఉన్నవారిలో కూడా బ్రెయిన్ అనూరిజం వచ్చే అవాకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో అవయవాలు పనిచేయని పరిస్థితి కూడా ఎదురవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.