భీమ్లానాయక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. రికార్డుల వేట కూడా మొదలు పెట్టేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో పవన్- రానా నట విశ్వరూపం చూసిన అభిమానులు అంతా సోషల్ మీడియాలో ఆ సినిమా గురించే చర్చలు, వెతుకులాట జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో రానా భార్య పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరనే ఆసక్తి ఎక్కువైంది.
సినిమాలో ఆమె పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. క్లైమాక్స్ లో ఆ పాత్రకు క్రూషియల్ రోల్ ఉంటుంది. అలాంటి పాత్రకు సంయుక్త మేనన్ ఎంతో న్యాయం చేసింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలయాళీ భామ. సంయుక్త ‘పాప్ కార్న్’ అనే మలయాళ సినిమాతో 2016లో తన కెరీర్ ప్రారంభించింది. ప్రారంభం నుంచి మలయాళంలో ఫుల్ బిజీ అయిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకుంది.
తమిళంలోనూ రెండు మూడు యూత్ ఫుల్ సినిమాల్లో తళుక్కు మంది. కానీ, అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. మళ్లీ మలయాళం ఇండస్ట్రీకే వచ్చేసింది. అలాంటి సమయంలో భీమ్లానాయక్ వంటి అదిరిపోయే సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. నిత్యామేనన్ తరహాలోనే రెండో హీరోయిన్ ను కూడా మలయాళీనే తీసుకోవాలని అనుకోవడం వల్లే సంయుక్తకు ఆ అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇంక టాలీవుడ్ నుంచి కూడా అవకాశాల మొదలు కావచ్చనే టాక్ వినిపిస్తోంది.