శ్రీకాంత్- ఊహ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ జంట పేరు బాగా వైరల్ అవుతోంది. 1997లో పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత.. పాతికేళ్లకు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఈ వార్త నెట్టింట కూడా బాగానే చక్కర్లు కొట్టింది. ఎంతలా అంటే శ్రీకాంత్- ఊహ బంధువులు, మిత్రులు అంతా వారికి ఫోన్లు చేసి వారిని ఓదార్చే దాకా వెళ్లిపోయింది. ఇదంతా చూసి శ్రీకాంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎంతో సంతోషంగా వారి వైవాహిక జీవితం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వార్తలు చూసి ఊహ కూడా కంగారు పడ్డారు. దాంతో ఇంక నేరుగా శ్రీకాంత్ ఈ వార్తలపై స్పందించారు. తమ విడాకుల వార్తలను ఖండిస్తూ ఓపెన్ లెటర్ కూడా రాశారు. ఈ సందర్భంగా మరోసారి శ్రీకాంత్- ఊహ లవ్ స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది.
శ్రీకాంత్- ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి వారి ప్రేమ గురించి, ప్రేమ పెళ్లి గురించి తెలియకపోవచ్చు. చాలా సందర్భాల్లో వాళ్లే తమ లవ్ స్టోరీని చెప్పుకున్నారు. ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్- ఊహల మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి 4 సినిమాల్లో నటించారు. అప్పట్లో వారి మధ్య ప్రేమ ఉందని, వాళ్లు ప్రేమించుకుంటున్నారని ఎవరికీ తెలియదు. శ్రీకాంత్ అప్పుడప్పుడూ ఊహ వాళ్ల ఇంటికి కూడా వెళ్లి వస్తుండేవారంట. కొన్నాళ్లు అంతా సజావుగానే సాగిపోయింది. అయితే ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇంక వీళ్ల పెళ్లి విషయాన్ని ఇంట్లో చెప్పక తప్పలేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది.
ఓ రోజు మద్రాస్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ ఊహ వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ ఊహ వాళ్ల తల్లిదండ్రులతో శ్రీకాంత్ తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న విషయాన్ని చెప్పేశాడు. ఆ వార్త వినగానే ఊహ తల్లిదండ్రులు ఇద్దరూ షాకయ్యారు. అప్పుడు ఊహ కూడా ఇంట్లోనే ఉండటంతో శ్రీకాంత్ ఆమెను మేడ మీదకు తీసుకెళ్లి తన మెడలోని బంగారు గొలుసు.. ఊహ మెడలో వేశారు. అయితే ముందు అత్తమామలకు విషయం చెప్పిన తర్వాతే శ్రీకాంత్ తల్లిదండ్రులకు చెప్పారు. అయితే శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా షాకయ్యారట. వారి ప్రేమ విషయం చెప్పగానే ఊహ తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. కానీ, అప్పుడప్పుడూ శ్రీకాంత్ వారి ఇంటికి వెళ్లి వస్తుండటంతో ఎలాంటి వాడో వారికి ఒక అవగాహన ఉంది. కాబట్టి పెళ్లికి వారిని ఒప్పించడం కాస్త సులువు అయ్యిందట.
1997లో శ్రీకాంత్- ఊహ వివాహం జరిగింది. ఈ ఏడాదితో వారి వివాహం జరిగి 25 సంవత్సరాలు పూర్తైంది. వివాహం తర్వాత ఊహ పూర్తిగా హౌస్‌వైఫ్‌గా మారిపోయారు. వారికి రోషన్, మేధ, రోహన్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోషన్ ఇప్పటికే హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు కూడా. నిజానికి ఈ 25 ఏళ్లలో ఊహ- శ్రీకాంత్ మధ్య విబేధాలు వచ్చింది లేదు. వాళ్ళు వార్తల్లో నిలిచింది లేదు. కానీ.., ఇప్పుడు ఒక్కసారిగా ఈ జంటపై ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి. సినిమా ప్రేమలకి, పెళ్లిళ్లకు విలువ ఉండదని బలంగా నమ్మే ఈ సమాజంలో ఊహ-శ్రీకాంత్ జోడీ పాతికేళ్లుగా ఆదర్శ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. కళ్ళ ముందు ఎంతో మంది కళాకారుల కాపురాలు కూలిపోతున్నా వీరు మాత్రం తమ బంధాన్ని బలంగా ఉంచుకుంటూనే వస్తున్నారు. ఓ రకంగా వీరిని ఇండస్ట్రీలో ఆదర్శవంతమైన జంటగా చెపుకోవచ్చు. ఈ పాతికేళ్లలో శ్రీకాంత్ హీరోగా వెలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. చేతిలో అవకాశాలు లేని సందర్భాలు ఉన్నాయి. కానీ.., అతనికి ఊహ నిత్యం అండగానే నిలుస్తూ వచ్చింది. ఇక శ్రీకాంత్ కూడా తన బాధ్యతలను, బంధాలను వదిలింది లేదు. ఎలా చూసుకున్నా.. ఇంత మంచి జంటపై ఇలాంటి గాలి వార్తలు పుట్టుకుని రావడం నిజంగా బాధాకరమైన విషయం.