ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సీనీ, రాజకీయలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీటికి మంచి ఆధరణ కూడా లభిస్తుంది. 13 సంవత్సరాల క్రితం జమ్మూకశ్మిర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను ఎదిరించి పోరాడటమే కాదు.. అందులో ఒక ఉగ్రవాదిని గొడ్డలితో నరికి.. మరో ఉగ్రవాదిని గన్ తో కాల్చి గాయపర్చింది.. ఈ ఘటన అప్పట్లో యావత్ భారతదేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆ యువతి పేరు రుక్సానా కౌసర్. తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ మూవీ తీసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జమ్ము కశ్మీర్ లో రాజౌరీ ప్రాంతంలో 2009 సెప్టెంబర్ 27 అర్థరాత్రి సమయంలో రుక్సానా కౌసర్ అనే యువతి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న సమయంలో ముగ్గురు కరడుగట్టిన తీవ్రవాదులు ఆమె ఇంటికి వచ్చారు. రుక్సానా తండ్రి నూర్ హుస్సేన్ తలుపులు తీసేందుకు నిరాకరించడంతో ఆ ఉగ్రవాదులు కిటికీ తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి జొరబడ్డారు. అదేసమయానికి రుక్సానా ఆమె తమ్ముడిని మంచం కింద దాచారు తల్లిదండ్రులు. తన కళ్ల ముందే తల్లిదండ్రులను హింసించడం తట్టుకోలేక రుక్సానా కౌసర్ బయటకు వచ్చి అక్కడే ఉన్న గొడ్డలితో అబు ఉసామా అనే ఉగ్రవాది తలపై గట్టిగొ కొట్టడంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ ఉగ్రవాది వద్ద ఉన్న గన్ తీసుకొని మరో ఇద్దరు ఉగ్రవాదులపై కాల్పులు జరపగా అందులో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అది చూసి మరో ఉగ్రవాది పారిపోయాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది రుక్సానా. తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి టెర్రరిస్టును చంపిన రుక్సానాని సాహస యువతిగా దేశమంతా కొనియాడారు. ఆమెకు ప్రభుత్వం తరుపు నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రుక్సానా ధైర్యసాహసాన్ని మెచ్చుకున్నారు.
రుక్సానా కౌసర్ జీవితాన్ని ఇప్పుడు వెండితెరపై చూపించేందుకు సిద్దమవుతున్నారు దర్శకుడు ఆసిఫ్ అలీ, నిర్మాత అశోక్ చౌహాన్. ఇక రుక్సానా పాత్రలో ప్రముఖ నటి సాహెూ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించబోతున్నట్లు బీటౌన్ టాక్. ఈ క్రమంలో రుక్సానా కౌసర్ ముంబాయికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున మూవీ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. గతంలో శ్రద్దాకపూర్ ముంబైని గడ గడలాడించిన హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘హసీనా పార్కర్’మూవీలో నటించింది.