సినీ ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఫలానా హీరో, హీరోయిన్ లేదా ఫలానా డైరెక్టర్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. సినిమాల్లో నటించాలనుకునే వారిని మాయమాటలతో నమ్మించి, మూవీస్‌లో చాన్సులు ఇప్పిస్తామంటూ వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక పేరు చెప్పి ఓ వ్యక్తికి రూ.20 లక్షలు టోకరా వేశాడు. ఈ ఘటన మరువక ముందే ఇలాంటి తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క, సంగీత దర్శకుడు మణిశర్మ పేరు చెప్పి రూ.51 లక్షలు మోసం చేసిన తాజాగా ఘటన వెలుగుజూసింది.
అనుష్క, మణిశర్మతో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే ఫిల్మ్ మేనేజర్ మోసం చేశాడు. లక్ష్మణ్ దగ్గర నుంచి ఏకంగా రూ.51 లక్షలు వసూలు చేశాడని తెలుస్తోంది. అనుష్కతో మూవీ డేట్స్ అంటూ నిర్మాతను పలుమార్లు బెంగళూరుకు తీసుకెళ్లిన ఎల్లారెడ్డి.. తొలుత రూ.26 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొంత డబ్బు.. అలా మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్‌మెంట్ మాత్రం ఇప్పించలేదు. మోసాన్ని గ్రహించిన లక్షణ్ చారి ఫిలిం చాంబర్‌ను ఆశ్రయించాడు. దీంతో డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పిన మేనేజర్ ఎల్లారెడ్డి.. ఆ తర్వాత తిరగబడ్డాడు. డబ్బులు అడిగితే తమ ఇంట్లోని ఆడవారితో కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. ఇక చేసేదేమీ లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.