ఐపీఎల్ లో మ్యాచులు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ల విషయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్య గొడవకు దిగారు. చెన్నై గెలుస్తుందని వెంకట్ ప్రభు, హైదరాబాద్ గెలుస్తుందని నాగ చైతన్య మాటల యుద్ధం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు మ్యాచ్ లో తలపడటానికి ముందే.. మ్యాచ్ విషయంలో కస్టడీ సినిమా టీమ్ గొడవకు దిగాయి. డైరెక్టర్ సీఎస్కే అభిమాని కావడం, హీరో నాగచైతన్య సన్ రైజర్స్ అభిమాని కావడంతో వారి మధ్య చిచ్చు రాజుకుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు చెన్నై జెర్సీలో ఉండగా.. నాగ చైతన్య హైదరాబాద్ జెర్సీలో ఉంటాడు. అది చూసిన డైరెక్టర్ కు కాస్త చిరాకు అనిపిస్తుంది. వెంటనే ఆ జెర్సీ తీసేసి చెన్నై జెర్సీ వేసుకోవాల్సిందిగా కోరతాడు. అందుకు నాగ చైతన్య ఆరెంజ్ ఆర్మీ ఇది అంటూ హైదరాబాద్ జట్టుకు తన సపోర్ట్ ని తెలియజేస్తాడు.
అక్కడి నుంచి వారి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఎల్లో అంటే ప్రేమ అంటూ వెంకట్ ప్రభు చెప్పుకొస్తాడు. అందుకు చై ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అంటూ కౌంటర్ ఇస్తాడు. వారు వీడియో గేమ్ ని చెన్నై మ్యాచ్ కి ముడిపెడతారు. వీడియో గేమ్ లో వెంకట్ ప్రభు ఓడిపోతే ఎస్సార్ హెచ్ జెర్సీ వేసుకోవాలి. ఒక నాగ చైతన్య ఓడిపోతే చెన్నై జెర్సీ వేసుకోవాల్సి ఉంటుంది. గేమ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో పవర్ కట్ అవుతుంది. అప్పుడు ప్రముఖ కమెడియన్ ప్రేమ్ గి అమెరెన్ ఎంట్రీ ఇస్తాడు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరు ఎందుకు రెండు ప్రాంతాలుగా విడిపోతున్నారు? అంటూ ఇద్దరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ తర్వాత వారి మధ్య సంధి కుదురుతుంది. ఇది చెన్నై vs హైదరాబాద్ మ్యాచ్ కాదు.. చెన్నై అండ్ హైదరాబాద్ అంటూ చెప్పుకొస్తాడు.
నాగ చైతన్య- వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన కస్టడీ చిత్రం మే 12న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ కాన్సెప్ట్ వీడియో రూపొందించారు. పైగా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ ని ఐపీఎల్ ని వాడుకుంటూ అందులోనూ చెన్నై- హైదరాబాద్ మ్యాచ్ ని వాడుకుంటూ ప్రమోట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి ప్రమోషన్స్ లో కస్టడీ టీమ్ చాలా కొత్తగా ట్రై చేశారనే చెప్పాలి. వారి ఎఫర్ట్స్ కు ప్రేక్షకులు, నెటిజన్స్ నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వీడియో మొత్తం నాగ చైతన్య ఎంతో బాగా తమిళ్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రమోషనల్ వీడియో అయినా.. నాగ చైతన్య యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. ఇంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.