సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సెలబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాట్రిక్ డెమార్చెలియర్ మార్చి 31న తుదిశ్వాస విడిచారు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో కొన్ని దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించిన పాట్రిక్.. 78 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.
1943లో జన్మించిన పాట్రిక్.. ఫ్రాన్స్‌లోని లే హవ్రే ప్రాంతంలో పెరిగారు. 20 ఏళ్ల వయస్సులో పారిస్ కు వెళ్లిన పాట్రిక్.. అమెరికాలో కూడా తన వృత్తిని కంటిన్యూ చేశారు. మొదట్లోఅసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన పాట్రిక్.. 1975లో న్యూయార్క్ కు వెళ్లకముందు అమెరికన్ వోగ్ మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటోషూట్ చేశాడు.
పాట్రిక్ కి అటు బ్రిటిష్ వోగ్, ఇటు అమెరికన్ వోగ్ రెండింటిలోనూ.. స్టైలిస్ట్ గ్రేస్ కోడింగ్ టన్ తో సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. ఇక 1992 సెప్టెంబర్ లో హార్పర్స్ బజార్ సంచిక కోసం లిండా ఎవాంజెలిస్టాతో చేసిన ‘A’ షూట్ చాలా పేరు తెచ్చింది.
మ్యాగజైన్ లకు మాత్రమే కాకుండా పాట్రిక్.. క్రిస్టియన్ డియోర్, రాల్ఫ్ లారెన్, చానెల్ మరియు జార్జియో అర్మానీ వంటి బ్రాండ్ లతో కూడా పనిచేశారు. పాపులర్ పిరెల్లి క్యాలెండర్ కోసం మూడుసార్లు( 2005, 2008 మరియు 2014లో) ఫోటోషూట్ చేశాడు. 2018లో ఫ్యాషన్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ‘ది బోస్టన్ గ్లోబ్’ కథనం ద్వారా అనేక మోడల్స్ నుండి ఊహించని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాట్రిక్ కి భార్య మియా, ముగ్గురు కుమారులు, ముగ్గురు మనుమలు ఉన్నారు.
ఇక పాట్రిక్ మృతితో ఇండస్ట్రీలో స్టార్స్ అంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. “మీ లెగసీ ఎప్పటికీ ఉండిపోతుంది. RIP పాట్రిక్ డెమార్చెలియర్ గారు. మీతో కలిసి వర్క్ చేసినందుకు గౌరవంగా భావిస్తున్నాను” అని ఆయన తీసిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక పిక్ వైరల్ అవుతోంది. ప్రియాంకతో పాటు బెల్లా హడిద్, ఎమిలీ రటాజ్ కోవిన్స్ కీ కూడా నెట్టింట సంతాపం తెలిపారు.