గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి, సేవ చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఎన్‌ఆర్‌ఐ, విదేశీ ప్రముఖులకు కూడా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ముగ్గురికి.. తెలంగాణ నుంచి ముగ్గురిని పద్మశ్రీలు వరించాయి. భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (తెలంగాణ)కు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది.
అయితే ఈ జాబితా ప్రకటించిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కారణం.. సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన కైకాల సత్యనారాయణకు ఈ ఏడాది కూడా పద్మ పురస్కారం లభించలేదు. 63 ఏళ్ల సినీ జీవితం, 750కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. అయినా కూడా ఇప్పటి వరకు ఆయనను ఒక్క పద్మం కూడా వరించకపోవడం విస్మయం కలిగించే అంశం. ఆయన ప్రతిభకు ఎప్పుడో రావాల్సిన పద్మ పురస్కారం కోసం 86 ఏళ్ల వయస్సులో ఇంకా ఆయన ఎదురుచూడాల్సి వస్తోంది.
బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలు..ఈస్టమన్ కలర్, గేవా, మోనో, స్టీరియో, సిక్స్ ట్రాక్, డాల్బీ, డీటీయస్ ఇలా సాంకేతికంగా తెలుగు సినిమా సాధించిన ప్రతీ మలుపుకూ సత్యనారాయణ ప్రత్యక్ష సాక్షి. హీరోగా, విలన్‌గా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్యనారాయణ పోషించని పాత్రలేదు, చూపించని వైవిధ్యమూ లేదు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకూ మూడు తరాలూ, కృష్ణ నుంచి మహేష్ బాబు వరకూ రెండు తరాలూ , చిరంజీవి శకం నుంచి రవితేజ వరకూ తరతరాల నటుల ఎదుగుదలకు ప్రత్యక్ష సాక్షి ఆయన.
నటుడిగానే కాకా నిర్మాతగా కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి సినిమాలు నిర్మించారాయన. అయినప్పటికీ ఆయనకు పద్మ అవార్డు వస్తుందని ప్రతీ ఏడూ ఎదురుచూడడం నిరాశపడడం కైకాల అభిమానులకు అలవాటైపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావుల తరంలో జీవించి ఉన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఒక్కరే. అయినా గానీ ఆయనను గుర్తించడం లేదు.. సరైన రీతిలో గౌరవించడం లేదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే ఆయన చేసిన పాపమా..
గతంలో తనకు పద్మ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎఫ్‌డీసీ కమీషనర్‌గా పనిచేసిన రమణాచారి, ఆ తర్వాతి సంవత్సరం సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పీఎస్సం జయ్ బారు సిఫార్స్ చేసినా.. కేవలం ఒకప్పుడు టీడీపీ ఎంపీగా పనిచేసానన్న ఒకేఒక్క కారణంతో తనకు పద్మ అవార్డు రాకుండా అడ్డుపడ్డారని ఓసారి సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. మరి రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న నటులకు ఈ అవార్డులు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు.
తాజాగా ప్రకటించిన జాబితాలో కాంగ్రెస్ నేత గులామ్ నబీ అజాద్, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ తదితరులను పద్మ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. నిజానికి కైకాల సత్యనారాయణ అనుభవానికి, ప్రజ్ఞకు, సినీరంగానికి ఆయన చేసిన సేవకు ఇలాంటి పురస్కారాలు ఎన్నడో రావాల్సి ఉంది. అయితే కైకాల సత్యనారాయణ మాత్రం ఈ పురస్కారాలూ, అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానం, చప్పట్లే తనకు దక్కిన నిజమైన అవార్డులని అంటారు. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.