సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘భీమ్లా.. నాయక్’ ఇదే టైటిల్ సాంగ్ రీసౌండింగ్ అవుతోంది. రిలీజైన 24 గంటల్లో 83 లక్షలకు పైగా వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ సాంగ్‌గా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ సాంగ్ మొదలవుతుండగా ‘ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. పుట్టిండాడు పులిపిల్ల నల్లమల తాలూకాల.. సెభాష్ భీమ్లానాయక’ అని ఒక సాకి వస్తుంది. ఆ సాకిని పాడింది ఎవరో కాదు ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు, 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య. ఈ పాటతో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. అసలు ఆయనకు ఆ అవకాశం ఎలా వచ్చింది. పవన్ కల్యాణ్‌ని ఎలా కలిశారు అంటూ దర్శనం మొగిలయ్యను సుమన్ టీవీ ఎక్సక్లూజివ్‌గా ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం.
మ్యూజిక్ డైరెక్టర్ హరికృష్ణ తనతో పాటలు పాడించేవాడని దర్శనం మొగిలయ్య తెలిపారు. హరికృష్ణనే తన నంబరు పవన్ కల్యాణ్‌కు ఇచ్చి ఈయనతో పాట పాడించుకోండని చెప్పినట్లు మొగిలయ్య తెలిపాడు. పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మా సినిమాలో పాటపాడాలని కోరినట్లు మొగిలయ్య తెలిపారు. అప్పుడు పవన్ అంత పెద్ద యాక్టర్ అని, పెద్ద నాయకుడని తనకు తెలియదని అన్నారు. తన పిల్లలు పవన్‌కల్యాణ్ గురించి చెప్పడంతో తాను చాలా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
‘రికార్డింగ్‌కు వెళ్లినప్పుడు పవన్ సార్‌ని కలిశాను. సాదాసీదాగా ఒక తెల్ల పంచ కట్టుకుని వచ్చారు. దర్శనం మొగిలయ్య గారూ నమస్కారం అనగానే నేను ఆశ్చర్యపోయాను. సార్ నమస్తే అన్నాను. మీరు చాలా బాగా వాయిస్తారు అంటూ నా కిన్నెర తీసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పటి వరకు నేను కలిసిన వారందరూ ఒక ఎత్తు.. పవన్ సార్‌ని కలవడం ఒకెత్తు ఆయన చాలా గొప్పవాడు’ అంటూ అప్పటి తన అనుభవాలను చెప్పుకొచ్చారు.
‘నేను నా కళను ప్రజలకు చేరువ చేయడానికే ఈ సినిమాలో పాట పాడాను. ఖర్చులకు ఇచ్చారు. తప్పకుండా ఇస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ నాకు కచ్చితంగా సాయం చేస్తానని చెప్పారు. ఆయన సినిమాతో నా పాట కోట్లమందికి చేరువవుతుందనే పాడాను డబ్బుకోసం కాదు’. పవన్ కల్యాణ్ తనను మళ్లీ కలుస్తానని మాటిచ్చినట్లు తెలిపారు. ఇంకా దర్శనం మొగిలయ్య గురించి మరెన్నో విశేషాలు సుమన్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా చేసిన ఇంటర్వ్యూలో మీకోసం.