సినిమా ఒక మనిషిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అనడానికి బలగం సినిమానే ఉదాహరణ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఆప్యాయత, అనురాగం వంటి బంధాలను తెంచుకుని బతుకుతున్న మనుషులు బలగం చూసి ఒకటవుతున్నారు. అందరం కలిసి ఉంటేనే బలగం అని తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా బలగం సినిమా చూసి విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారు. తాజాగా 45 ఏళ్ల తర్వాత ఒక కుటుంబం ఒకటైంది.
ఏ ముహూర్తాన హాస్యనటుడు వేణు దర్శకుడిగా మారారో గానీ తీసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అన్నిటికంటే మంచి ఒక మంచి సినిమా తీశావన్న పేరు సంపాదించుకున్నారు. బలగం సినిమాకి 4 గ్లోబల్ అవార్డులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉందో అనేది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని తమ జీవితానికి ఆపాదించుకుంటున్నారు. ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు ఒకటవుతున్నాయి. ఇటీవల స్థలం వివాదంలో విడిపోయిన అన్నదమ్ములు ఈ సినిమా చూశాక తమ తప్పు తెలుసుకుని ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా మరొక కుటుంబం బలగం సినిమా చూసి ఒకటైంది.
ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు లేవు గానీ ఒకప్పుడు కొడుకులు, కోడళ్ళు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులు కారణంగా బతుకు తెరువు కోసం ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి. పెద్ద కొడుకు ఒక ఊర్లో, చిన్న కొడుకు ఒక ఊర్లో.. ఇలా విశాలమైన ఉమ్మడి కుటుంబాలు ఇరుకిరుకు గదులుగా మారిపోయాయి. అయితే బలగం సినిమా కారణంగా ముక్కలైన ఉమ్మడి కుటుంబం మళ్ళీ కలిసింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బాన్ రెడ్డి, పోసక్క దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. కొడుకులకు, కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక విడిగా కాపురాలు పెట్టారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో విడివిడిగా నివాసం ఉంటున్నారు.
అయితే బాన్ రెడ్డి పెద్ద కొడుకు బాపురెడ్డి, కోడలు సరోజన కలిసి మిగతా కొడుకు, కూతుర్లను మంచిర్యాల రప్పించారు. అక్కడ ఓ థియేటర్ లో అందరూ కలిసి బలగం సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత అందరూ కలిసి ఉండాలని అని నిర్ణయించుకున్నారు. మంచిర్యాలలో ఒక ప్రైవేటు ఫంక్షన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆటపాటలతో సందడి చేశారు. ఇలా అందరం కలుసుకుని 45 ఏళ్లు అయ్యిందని.. ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని.. బలగం సినిమా తమలో మార్పు తీసుకొచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 45 ఏళ్ల తర్వాత కుటుంబం అంతా మళ్ళీ కలవడం పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.