గెటప్ శ్రీను.. జబర్దస్త్ లో తనదైన కామెడీతో ఆకట్టుకునే ఈ నటుడికి పరిచయం అవసరం లేదు. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న శ్రీను ఈ మధ్య కాలంలో సినిమాల్లోనూ బిజీ అయ్యాడు. కెరీర్ లో ఇంత సాధించినా డౌన్ టూ ఎర్త్ గా ఉండటం గెటప్ శ్రీనుకి అలవాటు. ఇక తన వంతుగా మంచి పనులు చేస్తూ.., ఆ విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులకు పంచుకుంటూ శ్రీను మంచి పేరు దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో గెటప్ శ్రీను ఇప్పుడు మరోసారి తన మంచి మనసుని చాటుకుంటూ.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడే పనిని బాధ్యతగా తీసుకుని, ఓ ఎమోషనల్ మ్యాటర్ ని తన ఇన్ స్టా స్టోరీగా పోస్ట్ చేశాడు.
“ఈ అబ్బాయి పేరు ఆనంద్. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. చికిత్స మేరకు నాలుగు లక్షలకు పైగా ఖర్చు అవుతుందట. తన కుటుంబం అంత ఖర్చుని చెల్లించలేని ఆర్థిక పరిస్థితుల వల్ల దాతలపై ఆశలు పెట్టుకున్నారు. మన మానవత్వంతో ఒకటైతే ఒక ప్రాణాన్ని కాపాడి తన కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లమవుతాం అంటూ” గెటప్ శ్రీను నెటిజన్స్ ను వేడుకుంటూ ఇన్ స్టా స్టోరీని పోస్ట్ చేశాడు.
శ్రీను సాయం మాటల వరకే పరిమితం కాలేదు. తాను స్వతహాగా రూ.20 వేల ఆనంద్ కి సెండ్ చేసి, ఆ స్క్రీన్ షాట్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఇన్ స్టా స్టోరీలో బాధితుడి అకౌంట్ డీటైల్స్ కూడా గెటప్ శ్రీను పొందుపరిచాడు. దీంతో.. శ్రీను మంచి మనసుని మెచ్చుకుంటూనే, నెటిజన్స్ అంతా ఆనంద్ కి తమ తోచిన సాయం చేస్తున్నారు. మరి.. ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి గెటప్ శ్రీను ఇంత కష్టపడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.