ఉపేంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, నటుడిగా, అంతకు మించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంని సెట్ చేసుకున్నారు. ఆలోచింపజేసే సినిమాలను తీయడంలో ఉపేంద్ర దిట్ట. అయితే ఆయన ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నారు. కన్నడలో హీరోగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన కబ్జా మార్చి 17న విడుదలైంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి కేజీఎఫ్ సినిమాని ఆదర్శంగా తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చూడగానే కేజీఎఫ్ వైబ్స్ రావడం, దానికి తోడు కన్నడ నుంచి ఉపేంద్ర హీరోగా సినిమా వస్తుండడంతో కబ్జా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
కొన్ని సినిమాలు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేస్తాయి. ఎన్నేళ్లయినా ఆ సినిమా చేసిన అద్భుతాలను ఎవరూ మర్చిపోరు. ఆ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ ని, ట్రెండ్ ని ఏ సినిమా మాయం చేయలేదు. కొత్తగా మరొక ట్రెండ్ సెట్ చేయాలి గానీ ఉన్న ట్రెండ్ ని పోగొట్టడం కష్టం. టాలీవుడ్ లో శివ, పోకిరి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ గుర్తుంది అంటే ఆ సినిమాలు ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈ మధ్య కాలంలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ సినిమా మేకింగ్, ఆ కథ, కథనం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మరీ ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. మళ్ళీ అలాంటి సినిమా రాదని జనాలు ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఉపేంద్ర నటించిన కబ్జా ట్రైలర్ చూసి మరో కేజీఎఫ్ అవుతుందని అనుకున్నారు. కానీ సినిమా చూస్తే కేజీఎఫ్ కి, కబ్జాకి.. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అర్ధమవుతుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. కేజీఎఫ్ ని చూసి కబ్జా వాతలు పెట్టుకుందేమో అన్న సందేహం వస్తుంది.
సినిమా మేకింగ్ కూడా కేజీఎఫ్ లానే ఉంది. కానీ కేజీఎఫ్ స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యింది. సినిమాటోగ్రఫీ నుంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకూ కేజీఎఫ్ ఆనవాళ్లు కనబడతాయి. అయితే కేజీఎఫ్ లో చూపించినంత ఎఫెక్టివ్ గా ఎమోషన్స్ గానీ, ఎలివేషన్స్ గానీ ఈ కబ్జాలో కనిపించవు. ఏదో కేజీఎఫ్ స్థానాన్ని కబ్జా చేసేయాలి అన్న ఆతురతతో గబగబా తీసేసినట్టు ఉంటుంది. ఎమోషన్స్, ఎలివేషన్స్ తో పాటు చాలా అంశాలను హ్యాండిల్ చేయడంలో కబ్జా టీమ్ ఫెయిలైంది. కేజీఎఫ్ లో హీరో గురించి ఇచ్చే ఎలివేషన్స్ కి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రాకీభాయ్ కథ చెప్తుంటే ప్రతీ సన్నివేశంలో రోమాలు నిలబడి ఉంటాయి. సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకూ ప్రతీ ఫ్రేమ్ లో, ప్రతీ సన్నివేశంతో, ప్రతీ ఎలిమెంట్ తో కనెక్ట్ అవుతాం.
ఒక్క మాటలో చెప్పాలంటే కేజీఎఫ్ లో రాకీభాయ్ కథతో పాటు మనం కూడా ప్రయాణం చేస్తుంటాం. రాకీభాయ్ గురించి జర్నలిస్టు తాత మనకే, మన పక్కనే ఉండి చెప్తున్నట్టు ఉంటుంది. రాకీభాయ్ వచ్చినప్పుడు మన ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఆ సినిమా ప్రత్యేకత. అలాంటి సినిమాకి ప్రత్యామ్నాయంగా కబ్జా సినిమా అనే విధంగా ప్రయత్నించినట్లు కనబడినా ఆ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. కేజీఎఫ్ ని ఇమిటేట్ చేసినా.. కథ ఏమైనా గొప్పగా ఉందా అంటే పస లేదు. ప్రధానంగా ఆసక్తి అనేది క్రియేట్ చేయలేకపోయింది. ఇక కబ్జాలో వచ్చే పాత్రలు ఎందుకొస్తాయో అనేది అర్ధం కాని పరిస్థితి. ఎంతసేపూ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లేపడమే సరిపోయింది గానీ సినిమా కథని లేపడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. దీంతో కబ్జా కాస్తా కాజా అయ్యిందన్న విమర్శలు మూటగట్టుకుంది.
హీరోకి భారీగా ఎలివేషన్స్ ఇస్తేనో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హీరోని లేపుతేనో సినిమా ఆడదు. సినిమాలో పస ఉండాలి. మంచి కథ, కథనం, హీరో మ్యానరిజం, హీరో ఎలివేషన్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కరెక్ట్ గా సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా ఎలాంటి ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా లేకుండా కేజీఎఫ్ స్థానాన్ని కబ్జా చేయాలని చూస్తే ఇలానే కాజా అవుతుంది. ఇప్పటికైనా ప్రతి సినిమా కేజీఎఫ్ కాలేదని తెలుసుకుంటే మంచిది. ఆ సినిమాని, ఈ సినిమాని చూసి వాతలు పెట్టుకోకుండా కథ మీద, కథనం మీద ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందనేది విశ్లేషకుల మాట. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.