పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి నిదానంగా బయటపడ్డాడు. కానీ, ఆ సినిమా ఇంప్యాక్ట్ మాత్రం ఇంకా పూరీ మీద కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదల తర్వాత భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే నిర్మాతలకు ఈ సినిమా పూరీ- చార్మీలకు పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. సరేలో పోతే పోయింది డబ్బేగా అని ఊరుకున్నారు. ఇప్పుడు అది మరో కోణంలో వీరి మెడకు చుట్టుకుంటోంది. లైగర్ సినిమాలో రాజకీయ నాయకుల పెట్టబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయంలో 15 రోజుల క్రితమే ఈడీ అధికారులు పూరీ- చార్మీలకు నోటీసులు జారీ చేశారు.
గురువారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్- చార్మీ వచ్చారు. అయితే మీడియాకి తెలియకుండా కార్యాలయం వెనుక నుంచి వీరు లోపలికి వెళ్లారు. లైగర్ సినిమా పెట్టుబడులకు సంబంధించి అధికారులు దాదాపు 12 గంటల వరకు పూరీ జగన్నాథ్- చార్మీలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఖాతాలోకి పెద్దఎత్తున విదేశీ నగదు జమ అయినట్లు గుర్తించే.. పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఆ తర్వాత పూరీతో పాటుగా మరో నిర్మాత చార్మీకి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సినిమాలో హవాలా- మనీలాండరింగ్ రూపంలో పెట్టుబడులు పెట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
విదేశీ పెట్టుబడులతో పాటుగా స్థానిక పెట్టుబడులకు సంబంధించి కూడా అధికారులు ఆరా తీశారు. సినిమా కలెక్షన్స్ కు సంబంధించి మాట్లాడుకున్న వాళ్లంతా ఇప్పుడు పెట్టుబడుల గురించి చర్చ మొదలు పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కుడా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన నగదు మొత్తం రాజకీయ నాయకులే ఇన్వెస్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లైగర్ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ బెదిరించడం చూశాం. వారికి పూరీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఈడీ విచారణతో మరోసారి లైగర్ సినిమా వార్తల్లో నిలిచింది. మరి.. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.