చిత్ర రంగంలో అవకాశం రావడం కష్టం. ఒకవేళ చాన్స్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. అయితే టాలెంట్ ఉన్నవారికి అవకాశం వస్తే నిలదొక్కుకోవడం సులువే. అలా ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంలో టాలీవుడ్ ముందుంటుంది. ఇక్కడ టెక్నీషియన్లుగా, నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది బాలీవుడ్, కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. హీరోయిన్లను ప్రోత్సహించడంలోనూ టాలీవుడ్ ముందుంటుంది. ఎంతోమంది పరభాషా హీరోయిన్లు తెలుగు హీరోలతో నటించి స్టార్‌డమ్ సంపాదించారు. అయితే ఇక్కడ పేరొచ్చాక మాత్రం.. టాలీవుడ్‌కు టాటా, బైబై చెప్పేసి బాలీవుడ్, కోలీవుడ్‌లో సెటిలవుతున్నారు. దీన్ని పక్కనబెడితే.. ఈతరంలో ఉన్న ప్రతిభావంతులైన హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు.
తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీతో పాటు పలు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ రాధికా ఆప్టే నటించారు. ప్రతి సినిమాలోనూ, ప్రతి పాత్రలోనూ అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారు రాధిక. అయితే కెరీర్ మొదట్లో ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో యాక్ట్ చేశారు. కానీ వాటితో రాని గుర్తింపు తెలుగు సినిమాలతో ఆమె తెచ్చుకున్నారు. 2010లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ ‘రక్తచరిత్ర’తో నటిగా రాధిక మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు నందమూరి నటసింహం బాలకృష్ణతో కలసి నటించిన ‘లెజెండ్’తో ఆమె బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ‘లెజెండ్’ తర్వాత బాలయ్య సరసన ‘లయన్’ మూవీలోనూ రాధిక యాక్ట్ చేశారు. ఈ మూవీ మోస్తరు విజయం సాధించింది.
తెలుగులో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో రాధికా ఆప్టేకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో ముంబైకి వెళ్లిపోయిన ఆమె.. ‘బద్లాపూర్’, ‘హంటర్’, ‘మాంఝీ’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘అంధాధున్’ సినిమాలతో ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. మధ్యలో రజినీకాంత్ ‘కబాలి’తో సౌత్ ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ తర్వాత మాత్రం రాధిక ఇక్కడ యాక్ట్ చేయలేదు. ప్రస్తుతం పలు కథలను వింటున్న ఆమె.. అందులో కొన్నింటికి ఓకే చెప్పారని సమాచారం. అయితే తాజాగా తన చిన్ననాటి ఓ ఫొటోను సోషల్ మీడియాలో రాధిక షేర్ చేశారు. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రాధిక.. చిన్నప్పుడు తాను కరాటే ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో రాధికతో పాటు ఆమె కోచ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘మీరు చిన్నప్పుడు కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ ఆ ఫొటోను చూసిన రాధిక ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, రాధిక ఆప్టే చిన్ననాటి ఫొటో ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.