క్యాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కానీ అనేక మంది సెలబ్రిటీలు క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే ఇలా చాలా మంది సెలబ్రిటీలు క్యాన్సర్ ని జయించారు. ఈ లిస్టులో ఒక తెలుగు హీరోయిన్ కూడా ఉంది. సుదీర్ఘ కాలం పాటు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయట పడింది. ఒకసారి కాదు, రెండు సార్లు ఆ హీరోయిన్ ని తీసుకెళ్లిపోవాలని ప్రయత్నించింది. కానీ రెండు సార్లూ ఆ బతకాలన్న హీరోయిన్ సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. దురదృష్టవశాత్తు ఆమె క్యాన్సర్ ను పొందింది, కానీ ఈమె అదృష్టం కొద్దీ క్యాన్సర్ ఆ హీరోయిన్ ని పొందలేకపోయింది.
ఆమె ఎవరో కాదు, మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్. ప్లేబ్యాక్ సింగర్ గా, హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ, హోమం, చింతకాయల రవి, కింగ్ వంటి సినిమాల్లో నటించింది. హీరోయిన్ గానే కాకుండా గాయనిగా కూడా తన మార్కు క్రియేట్ చేసిన ఈ గాయనికి క్యాన్సర్ అనే గాయం తగిలింది. అది 2009వ సంవత్సరం. హాడ్కిన్ లింఫోమా అనే ఒక రకమైన క్యాన్సర్ వ్యాధి సోకింది. అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె వయసు 24 ఏళ్లు ఉంటాయి. 2013లో ‘బోన్ మారో’ ట్రాన్స్ ప్లాంట్ జరిగింది.
అది ఫెయిల్ అవ్వడంతో పోయిందనుకున్న క్యాన్సర్ మళ్ళీ వచ్చింది. అయినా గానీ వెనక్కి తగ్గలేదు. 2016లో అమెరికా వెళ్లి కంటిన్యూగా చికిత్స తీసుకుంటూనే ఉంది. అయితే క్లాసికల్ హాడ్కిన్ లింఫోమా వ్యాధికి ట్రీట్మెంట్ కోసం 2016లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఎఫ్డీఏ ఆమోదంతో ‘నివొలుమాబ్’ అనే మెడిసన్ మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. అదృష్టం కొద్దీ మమతా మోహన్ దాస్ బతికింది. 2019లో సోషల్ మీడియా నిర్వహించిన 10 ఇయర్స్ ఛాలెంజ్ ని మమతా మోహన్ దాస్ స్వీకరించింది. 10 ఇయర్స్ ఛాలెంజ్ లో భాగంగా తాను 7 ఏళ్ళు అనుభవించిన స్ట్రగుల్ ని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది.
‘నేను క్యాన్సర్ ని పొందాను. కానీ క్యాన్సర్ నన్ను పొందలేకపోయింది’ అంటూ మొదలుపెట్టి క్యాన్సర్ తో కలిసి ప్రయాణం చేసిన విధానాన్ని వివరించింది. అయితే 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో క్యాన్సర్ తో పాటు ఆమె భర్త కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం మలయాళంలో 2, తమిళంలో 2 సినిమాలతో పాటు తెలుగులో రుద్రంగి అనే సినిమా ఒకటి చేస్తుంది. ఈరోజే ఎందుకు ఈమె గురించి మాట్లాడుకోవడం అంటే.. ఈరోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. క్యాన్సర్ అనేది పెద్ద భూతమే కావచ్చు. కానీ బతకాలన్న సంకల్పం, ధైర్యం ముందు క్యాన్సర్ మోకరిల్లుతుంది. ఆశ క్యాన్సర్ ఉన్నోళ్ళని కూడా బతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నోళ్ళని కూడా చంపేస్తుంది.
క్యాన్సర్ అనే కాదు ఏ రోగానికి అయినా మందు మనసు. మనసును మించిన ఖరీదైన మందు లేదు. మానసికంగా ధైర్యంగా ఉంటే ఏ మందు అయినా పని చేస్తుంది. మానసికంగా ధైర్యంగా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బతకడం కష్టం. అందుకే క్యాన్సర్ రోగుల్లో(పోరాట యోధుల్లో) భయాన్ని బదులు ధైర్యాన్ని నింపాలి. అందుకోసం మమతా మోహన్ దాస్ లాంటి వారి పోరాట జీవితాలు స్ఫూర్తిని నింపుతాయి. మరి స్ఫూర్తిదాయకమైన మమతా మోహన్ దాస్ కథని షేర్ చేయడం ద్వారా ఒక్క క్యాన్సర్ పేషెంట్ లో అయినా ధైర్యం నింపిన వారు అవుతారు. ఆలస్యం చేయకండి. షేర్ చేయండి.