భారతీయ చలన చిత్ర రంగంలో దివ్య భారతి అతి పిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 90 వ దశకంలో కుర్రకారుని ఉర్రూతలూగించింది. బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రమాదవశాత్తూ ఆమె భవంతిపై నుంచి పడి 1993లో మృతి చెందింది. కేవలం 19 ఏళ్లకే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో సినీ తారలు, ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అయ్యారు.
తాజాగా దివంగత నటి దివ్య భారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి కన్నుమూశారు. అక్టోబర్ 30, 2021న, దివంగత నటి తండ్రి ఓం ప్రకాష్ భారతి తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌లో ఓ మీడియా కథనం ప్రకారం దివ్య భారతి మాజీ భర్త, చిత్రనిర్మాత సాజిద్ నదియాడ్వాలా వద్దనే ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. ప్రమాద వశాత్తు దివ్యభారతి చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో అదే విధంగా దివ్య భారతి తల్లిదండ్రులను కూడా చూసుకున్నారని తెలిసింది. అంతేకాదు ఓం ప్రకాష్ భారతి చివరి శ్వాస వరకు సాజిద్ దగ్గరే ఉన్నట్లు బాలీవుడ్ టాక్. సాజిద్ దివ్యభారతి తల్లి దండ్రులను అమ్మా నాన్న అని పిలిచేవాడని బాలీవుడ్ టాక్.
ఇప్పుడు దివ్య భారతి, ఆమె తండ్రి ఓం ప్రకాష్ భారతి ఇద్దరూ ఈ ప్రపంచంలో లేరు. ‘షోలా ఔర్ షబ్నం’ సినిమా సెట్స్‌లో సాజిద్ నడియాడ్‌వాలాతో దివ్య భారతి మొదటి సమావేశం జరిగింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలకు చెప్పకుండా గుట్టుగా 1992లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వీరి వివాహబంధం గురించి తెలిసింది. 1993లో దివ్య భారతి తన ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. అప్పట్లో ఆమె మరణం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే దివ్య మరణం తరువాత సాజిద్ ఆమెను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసులు దానిని ప్రమాదవశాత్తు అని ప్రకటించారు.