మంచు సోదరులు మధ్య అసలేం జరుగుతుంది.. అన్నదమ్ములిద్దరూ విడిపోయారా.. ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారా.. ఇద్దరికి పడటం లేదా.. అనే సందేహాలు ఎప్పటి నుంచో వినిపిస్తుండా.. మనోజ్ రెండో పెళ్లి సందర్భంగా అవి మరింత పెరిగాయి. ఈ క్రమంలో మనోజ్ చేసిన ఓ పోస్ట్.. కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
మంచు కుటుంబంలో విభేదాలు తెర మీదకు వచ్చాయి. మంచు సోదరులు విష్ణు, మనోజ్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మనోజ్ రెండో వివాహం సందర్భంగా కూడా మంచు విష్ణు ఏదో చుట్టపు చూపుగా వచ్చి.. కాసేపు ఉండి వెళ్లి పోయాడు. పెళ్లి కూడా మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. ఇవన్ని గతంలో చర్చనీయాంశంగా మారాయి. ఇక రెండు మూడేళ్లుగా వీరిద్దరూ కనీసం బర్త్‌డే విషేస్ కూడా చెప్పుకోవడం లేదు. తాజాగా మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూడా వీరిద్దరూ దూరంగానే ఉన్నారు. మోహన్ బాబు, విష్ణు స్టేజీ మీద ఉండగా.. మనోజ్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. మోహన్ బాబు రమ్మని పిలిచినా.. మనోజ్ వారి పక్కకు వెళ్లలేదు.
ప్రస్తుతం మోహన్ బాబు-విష్ణు కలిసి ఉంటున్నారు. మనోజ్ విడిగా ఉంటున్నాడు. అయితే మంచు కుటుంబంలో విబేధాలు ఉన్నట్లు ఎన్ని వార్తలు వచ్చినా.. వీరు మాత్రం గంభీరంగానే ఉన్నారు. ఎక్కడా పెదవి విప్పలేదు. స్పందించలేదు. కానీ తాజాగా మనోజ్ పోస్ట్ చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది. దీనిలో మంచు విష్ణు.. ఎవరి మీదనో దాడి చేయడానికి వెళ్లినట్లుగా ఉంది. వీడియో చివర్లో మనోజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంచు విష్ణు.. తన ఇంటి మీదకు వచ్చి.. దాడి చేస్తున్న వీడియోని మనోజ్ స్టేటస్‌గా పెట్టడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో విష్ణు.. ఎవరి ఇంటికో వెళ్లి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు విష్ణును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వారి పక్కన ఉన్న గదిలో ఎవరో ఉన్నారని.. వారు బయటకు రాకుండా గడి వేయడంతో.. వారు డోర్‌ను తంతున్నారు. ఇక వీడియో చివర్లో.. మనోజ్.. ఇలా తరచుగా మా ఇంటికి వచ్చి గొడవ చేయడం అలవాటు అయ్యింది అనడం వినిపిస్తోంది.
ఇక విష్ణు గొడవపడుతున్న వ్యక్తిని సారథిగా గుర్తించారు. ఇతడు గత కొంతకాలంగా మంచు కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. అయితే కొన్ని నెలలుగా సారథి.. మనోజ్ దగ్గర పని చేస్తున్నాడు. మరి వివాదం ఏంటో తెలియదు కానీ.. విష్ణు సారథి ఇంటికి వెళ్లి.. ఏదో గలాటా సృష్టించాడు. ఎవరినో కొట్టే ప్రయత్నం చేసినట్లుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ విడుదల చేశాడు. విష్ణు తరచుగా ఇలా ఇళ్లల్లకు వచ్చి మా వాళ్లని, బంధువులను ఇలా కొడుతూ ఉంటాడు.. ఇది సిట్యూవేషన్ అంటూ మనోజ్ కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాక వీడియోలో మేమేమైనా ఊరికే ఇచ్చామా.. తీసుకున్నామా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి.. వాళ్ల మధ్య జరిగిన ఫ్యామిలీ వివాదంగానే తోస్తుంది.
ఈ వీడియో చూసిన వారు.. మంచు విష్ణు.. సారథి ఇంటికి ఎందుకు వచ్చాడు.. అసలు బయటి వ్యక్తితో విష్ణు గొడవపడాల్సిన అవసరం ఏంటి.. ఇంతకు ఈ గొడవ ఎప్పుడు జరిగింది.. మరి ఇప్పుడు వివాదం సద్దుమణిగిందా లేదా అన్న వివరాలు తెలియడం లేదు. అయితే విష్ణు, మనోజ్‌ల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే ఇంత వరకు వీటి గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కానీ తొలిసారి మనోజ్.. ఈ వీడియోని పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే చాలా మంది ఇది ప్రాంక్ అని కొట్టి పారేస్తున్నారు. దీనిపై మంచు కుటుంబం స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.