తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక పెట్టిన చిచ్చు ఎవ్వరూ మరిచిపోలేనిది. ఆ నిప్పుల సెగ కాస్త చల్లారిందని అనుకుంటుండగా.., ఇప్పుడు పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం పుట్టుకొచ్చింది. ఈ రగడకి కేంద్రంగా నిలిచింది మాత్రం డైరెక్టర్స్ అసోసియేషన్. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి కె.వి.ఆర్ చౌదరి ఇద్దరు సభ్యుల నామినేషన్స్‌ను తిరస్కరించడం వివాదానికి, చర్చకు దారి తీసింది.
సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి నామినేషన్ వేయగా.., . కె.వి.ఆర్ చౌదరి ఈ నామినేషన్ ని తిరస్కరించారు. ప్రభు ప్రస్తుతం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా అసోసియేషన్ పదవిలో ఉన్నట్లయితే.. దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదు అనే నిబంధన ఉంది. అందుకే ప్రభు నామినేషన్ ను తిరస్కరించినట్టు కె.వి.ఆర్ చౌదరి చెప్పుకొస్తున్నారు. కానీ.., వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనేది చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లో దేనికీ సంబంధించినది కాదు. అది ఫిల్మ్ జర్నలిస్టులకు సంబంధించిన అసోసియేషన్. మరి.. ఈ అసోసియేషన్ కి, 24 క్రాఫ్ట్స్ సంబంధం ఏమిటి అన్నది జర్నలిస్ట్ ప్రభు వాదన. ఇదే కారణాన్ని చూపి మరొక సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ అభ్యర్థిత్వాన్ని కూడా కె.వి.ఆర్ చౌదరి తిరస్కరించారు. దీంతో.. తమ నామినేషన్స్ ని తిరస్కరించడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం ఉందని, మినిట్స్ బుక్‌లోని రిసొల్యుషన్స్ ను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన గత కమిటీకి రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి కొమ్ముకాస్తున్నారని మద్దినేని రమేష్ ఆరోపణలు చేశారు. అలాగే జర్నలిస్ట్ ప్రభు కూడా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.