బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా ఓ సింగర్‌కు ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు వేణు. ఆ వివరాలు..
స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంలో.. కల్తీ లేని మట్టి మనసులు స్వభావాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన చిత్రం బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం వెండి తెర మీద దుమ్ము రేపింది. తెలంగాణ భాష, యాస, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి అద్భుతంగా వివరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రతి ఒక్కరిని కదిలించింది. తెర మీద వచ్చే ప్రతి సన్నివేశం.. మన నిజ జీవితంలో ఏదో ఓ సందర్భంలో చోటు చేసుకున్నదే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. తెర మీద తమ జీవితాలను చూసుకున్నట్లు ఫీలయ్యారు. ఇక ఈ సినిమాకు పాటలే ప్రధాన బలం. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే బుడగ జంగాల పాట.. సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు. ఆ ఒక్క పాటతో.. సినిమా స్థాయి పెరిగింది అంటే ఆ పాట గొప్పతనం గురించి అర్థం చేసుకోవచ్చు.
కుటుంబం, తోబుట్టువులు మధ్య నెలకొన్న అనుబంధాలు, బాధ్యతల గురించి ఈ పాట చక్కగా వివరిస్తుంది. ఈ బుర్రకథ గానాన్ని వరంగల్ జిల్లాకు చెందిన కొమురవ్వ, మొగిలయ్యలు ఆలపించారు. సినిమాలో తమ పాటతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన వీరు.. వాస్తవంగా ఎంతో దీన స్థితిలో జీవితం వెళ్లదీస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. ఈ విషయం కాస్త బలగం డైరెక్టర్ వేణుకు తెలిసింది. దాంతో వారిని ఆదుకోవడానికి వేణు ముందుకు వచ్చాడు.
మొగిలయ్య రెండు కిడ్నీలు పాడయ్యాయి అని తెలుసుకున్న వేణు.. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండల కేంద్రంలోని మొగిలయ్య ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సాయంతో పాటు ఉచితంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొమురవ్వ, మొగిలయ్యలను డైరెక్టర్ వేణు తన మిత్ర బృందంతో కలిసి ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు, గేయ రచయిత కాసర్ల శ్యామ్, యాంకర్ గీత భగత్ కలిసి మొగిలయ్యకు 70 వేల రూపాయలు అందించారు. అలానే మరో 30 వేల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. వారితో కలిసి భోజనం చేసి.. మొగిలయ్యాకు ధైర్యం చెప్పారు.
అంతేకాక బలగం సినిమా నిర్మాత దిల్ రాజుకు కూడా మొగిలయ్య అనారోగ్యం గురించి తెలిపి.. ఆర్థిక సాయం ఇప్పిస్తామని వేణు హామీ ఇచ్చాడు. ఇక ‘బలగం’ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే బుర్రకథ పాటకు కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అంత ఆర్ధ్రతతో ఆ పాటను ఆలపించి ప్రేక్షకులను అలరించారు మొగిలవ్వ. ఇక సినిమా విజయంలో కొమురవ్వ, మొగిలయ్య కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట చిత్రీకరణ సమయంలో.. కొమురవ్వ పాడుతూనే ఎమోషనల్ అయిందంటూ వేణు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. కాగా.. మరుగున పడిపోతున్న ఇలాంటి కళాకారులను సినిమా ద్వారా వెలుగులోకి తెచ్చిన వేణు.. ఇప్పుడు మానవత్వంతో వారిని ఆదుకోవడం నిజంగా గ్రేటే అంటున్నారు జనాలు. వేణు మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేణు చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయండి.