సాధారణంగా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమా చూసేవాళ్లు తగ్గిపోతున్నారు అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పైగా కొన్నాళ్లకు థియేటర్లలో సినిమా చచ్చిపోతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలపై డైరెక్టర్ తేజ స్పందించారు. అలాంటి అన్ని వ్యాఖ్యలకు తేజ సమాధానం చెప్పారు.
ప్రేక్షకుల ఎంటర్ టైన్మెంట్ సోర్సుల్లో చాలా మార్పులు వచ్చాయి. వీధి నాటకాల నుంచి ఓటీటీల్లో సినిమాలు చూసేదాకా వచ్చేశాం. ఇంక థియేటర్ల విషయంలో అయితే పెను మార్పులే జరిగాయి. 70 ఎంఎం నుంచి 4డీఎక్స్ దాకా వచ్చాం. ఇంక మార్పులు జరుగుతూనే ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులు మాత్రం మారలేదు. వారికి వినోదం పంచే ఏ ఒక్క మార్గాన్ని వదులుకోలేదు. అయితే కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు, ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. థియేటర్లలో సినిమా చచ్చిపోతుంది అనే స్టేట్మెంట్లు కూడా చూస్తున్నాం. ఈ వ్యాఖ్యలకు డైరెక్టర్ తేజ తనదైనశైలిలో సమాధానం చెప్పారు.
థియేటర్లలో సినిమా చచ్చిపోతోంది అనే కామెంట్స్ పై డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. “మొదట ప్రజలు నాటకాలు చూసేవాళ్లు. ఆ తర్వాత సినిమా థియేటర్లు వచ్చాయి. అప్పుడు థియేటర్లలో సినిమాలు చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత అందరికీ టీవీ అందుబాటులోకి వచ్చింది. అందరూ టీవీ చూడటం ప్రారంభించారు. కానీ, థియేటర్లలో సినిమా అలాగే ఉంది. నిజానికి టీవీ వచ్చాక థియేటర్లో సినిమా చచ్చిపోవాలిగా? ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి. అయినా థియేటర్లో సినిమా చచ్చిపోదు. ఎందుకంటే మనం స్క్రీన్ ముందు చిన్నగా ఉంటాం. అక్కడ పెద్ద ఆకారాల్లో హీరో, విలన్ కొట్టుకుంటుంటో ఏదో దేవుళ్లు కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. ఆ ఫీల్ ని ప్రేక్షకులు మిస్ కారు”
“నేను ప్రతివారం సినిమాకి వెళ్తాను. నేను సింగిల్ స్క్రీన్ లోనే సినిమా చూస్తాను. ఎందుకంటే అక్కడ అయితేనే స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు అన్నీ చిన్నగా చేస్తున్నారు. నాకు ఈ మధ్య బాగా వినిపిస్తున్న కంప్లైంట్ మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్, కోక్ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. టికెట్ రేట్ల కంటే వాటి ధరలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. నిజానకి ఓటీటీలు సినిమాని చంపలేవు. కానీ, పాప్ కార్న్ రేటు థియేటర్లలో సినిమాని చంపగలదు. ముంబయిలో సినిమా చచ్చిపోయింది అంటే దానికి ఇదే కారణం. మీరు మల్టీప్లెక్సులకు వెళ్లకండి. సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూడండి. సినిమాలను ఏదీ చంపలేదు. ఒక్క పాప్ కార్న్ రేటు మాత్రం చంపగలదు” అంటూ డైరెక్టర్ తేజ వ్యాఖ్యానించారు.