Selva Raghavan: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, హీరో కార్తీల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రతీ షో హౌస్ ఫుల్ బోర్డులతో నడిచింది. అయితే, ఈ సినిమా తమిళంలో యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా సరిగా రాలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రొడక్షన్‌లో భాగమైన దర్శకుడు సెల్వ రాఘవన్‌కు అప్పులు మిగిలాయి. ఈ అప్పులు తీర్చడానికి తాను ఎంతో కష్టపడ్డానని ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ మాట్లాడుతూ..
‘‘యుగానికి ఒక్కడు సినిమా నిర్మాత 60 శాతం పెట్టుబడి పెట్టాడు. నేను ముందుగా ఎంత చెప్పానో ఆయన అంత డబ్బు పెట్టేశాడు. అంతటితో ఆయన పని అయిపోయింది. ఇక, నేను ఆయన్ని డబ్బులు పెట్టడం ఆపమని చెప్పాను. మిగిలిన 40 శాతం బడ్జెట్ నేను సొంతంగా పెట్టాను. రిలీజ్ సమయంలో ఆ ప్రొడ్యూసర్‌కు డబ్బులు వచ్చేశాయి. నేను పెట్టుబడిగా పెట్టింది మాత్రం తిరిగిరాలేదు. ప్రొడ్యూషర్స్ కౌన్సిల్‌లోని వారికి ఈ నిజం తెలుసు. ఆ పెట్టిన పెట్టుబడి తాలూకా అప్పులు తీర్చడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. మూడేళ్ల క్రితం వరకు ఆ అప్పులు కట్టాను.
కానీ, చాలా మందికి ఈ విషయం తెలీదు. యుగానికి ఒక్కడు సినిమా కోసం మొత్తం 30 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. అందులో 12 కోట్ల రూపాయలు నా సొంతంగా బయట అప్పు తెచ్చి మరీ పెట్టాను. ఆ సమయంలో 30 కోట్లు అంటే చాలా పెద్ద సినిమా. అంటే ఆ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తేనే లాభాలు వచ్చినట్లు. కానీ, మేము అనుకున్నంత ఆ సినిమా కలెక్ట్ చేయలేకపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యుగానికి ఒక్కడు సినిమాలో ఆడ్రియా జెర్మయ్యా, రీమాసేన్, పార్థిబన్, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తం చోళులు, పాండ్యుల గొడవ నేపథ్యంలో తెరకెక్కింది.