డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా డీలక్స్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ప్రభాస్ నటించే ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నాడు అన్న వార్త ప్రస్తుతం పరిశ్రమంలో హాట్ టాపిక్ గా మారింది.
సినిమాని ఆసక్తికరంగా మార్చడానికి స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ హీరో అతిధి పాత్రలో మెరవడం.. అదేవిధంగా బడా సినిమాల్లో హీరోలను(అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి, రానా, ఆది పినిశెట్టి) విలన్ గా చూపించడం మనం చూసేసాము. ఇక మార్కెట్ కోసం మల్టీ స్టారర్ ట్రెండ్ కి సైతం ఇప్పుడు మన స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కొంచెం కొత్తగా ఒక సీనియర్ డైరెక్టర్ టాప్ హీరో సినిమాలో కనిపిస్తున్నాడన్న విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రిలీజ్ అవ్వడంలో కాస్త సందిగ్దత ఉన్నప్పటికీ ఏ పాన్ ఇండియా హీరోకి లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉండడం విశేషం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఈ యంగ్ రెబల్ స్టార్ అభిమానులని అలరించనున్నాడు. వీటిలో ఆదిపురుష్ మొదటి వరుసలో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. ఆ తర్వాత సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాల విడుదల విషయంలో స్పష్టత రాకపోయినా అభిమానులకి మాత్రం చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ సినిమాలను చూసే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రానుండగా.. ప్రభాస్ సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా రామ్ గోపాల్ వర్మ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోలో ఒక సెట్ వేసినట్టు.. కీలక ఆర్టిస్టులతో పాటు వర్మ పాల్గొన్న ఒక సీన్స్ ను దర్శకుడు మారుతి చిత్రీకరించారని టాక్ నడుస్తుంది.
వర్మతో తీసిన సీన్లు అనుకున్నంత బాగా రాలేదని.. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వాటిని ఉంచాలా లేదా అనే విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక అభిమానులైతే వర్మ కోసం డిజైన్ చేసే పాత్ర ఏముంటుందనే ఆలోచనలో పడ్డారు. నిజంగా ఈ వార్త నిజమైతే సినిమాకు ఇంకాస్త హైప్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సినిమాలతో పాటు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా పాపులర్ అయ్యాడు. తన జీనియస్ తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. మరి ఈ కల్ట్ డైరెక్టర్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.