తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరావు మృతిచెందారు. నాగేశ్వరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ పరిశ్రమం ఒక్కసారిగా మూగబోయింది. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్. రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కేఎస్ నాగేశ్వరావు. ‘పోలీస్’ చిత్రం ద్వారా నాగేశ్వరావు… శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు.
నాగేశ్వరావు.. ఫిట్స్ రావటంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని ఆయన కుమారుడు అన్నారు. నిన్న విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలోకి రాగానే ఫిట్స్ వచ్చిందని.. స్థానికంగా ఉన్న రెండు, మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా సరైన వైద్యం అందలేదు. దీంతో ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికి సమయానికి వైద్యం అందక కేఎస్ మరణించినట్లు కుమారుడు తెలిపారు. నాగేశ్వరావు మృతదేహాన్ని ఆయన అత్తగారి గ్రామమైన కవులూరులో ఉంచారు. అక్కడే కేఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు.
కేఎస్ 1986లో కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమల్లో కెరీర్ ప్రారంభించారు. నాగేశ్వరావు ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీహరితో తీసిన ‘పోలీస్’ మూవీ హిట్ కావటంతో ఇంక వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత శ్రీశైలం, సాంబయ్య వంటి సినిమాలను శ్రీహరితో తెరకెక్కించారు. చదలవాడ శ్రీనివాస రావు నిర్మాణంలో కేఎస్ వాళ్ల అబ్బాయి హీరోగా పరిచయం కానున్నారు. ఆ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇంతలోనే నాగేశ్వరావు అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందారు.