సాధారణంగా సినీ దర్శకులు ఎవరైనా వారికంటూ ప్రత్యేకమైన స్టైల్ అనేది ఏర్పడుతుంది. ఫలానా మాస్ డైరెక్టర్.. క్లాస్ డైరెక్టర్.. క్రియేటివ్.. సెన్సిబుల్.. ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ తో పాపులర్ అవుతుంటారు. అంటే.. వాళ్ళ నుండి ఆయా జానర్స్ లో ఎక్కువ సినిమాలు వచ్చేసరికి ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే ఎక్సపెక్ట్ చేస్తుంటారు. ఒకవేళ కొత్తరకం సినిమాలు తీసినా.. అందులో వీళ్లకు సక్సెస్ ఫార్ములాగా నిలిచిన కొన్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ ని మిస్ కాకుండా చూసుకుంటారు. అలా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు, గుర్తింపు దక్కించుకున్న మోస్ట్ వాంటెడ్ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు.
కెరీర్ లో ఇప్పటివరకు 20 సినిమాలు తీసిన కృష్ణవంశీ.. తన సినిమాలతో ట్రెండ్ సృష్టించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు.. కథాకథనాలు.. బలమైన భావోద్వేగాలు.. గుండెను తడిపే సన్నివేశాలు.. ఇలా అన్నివిధాలా దిట్ట అనిపించుకున్నారు కృష్ణవంశీ. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ.. లాంటి సినిమాలతో ప్రేక్షకులలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కృష్ణవంశీ.. కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుతం కృష్ణవంశీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ మూవీ చేస్తున్నాడు. 2016లో విడుదలైన ‘నటసామ్రాట్’ అనే మరాఠీ మూవీకి రీమేక్ ఇది.
ఆ తర్వాత అన్నం అని మరో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ.. పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘మీ నుండి మాస్ సినిమా ఎప్పుడు వస్తుంది?’ అని అడిగిన ప్రశ్నకు.. “మాస్ సినిమాలు తీయడం నాకు చేతకాదు. అసలు మాస్ సినిమా అంటే ఏంటనే డెఫినేషన్ ఇంకా నాకు తెలియదు. ఫుల్లు ఫైట్స్ పెట్టేసి.. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ తో నాకు నచ్చవు. నాకు సినిమాలో సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి.. కలర్ ఫుల్ గా ఉండాలి.. ప్రోగ్రెసివ్, మేనర్స్, వాల్యూ సిస్టమ్, కంట్రీ ఉండాలి..” అని చెప్పుకొచ్చారు. అయితే.. కృష్ణవంశీకి మాస్ అంటే ఏంటో తెలియదనే సరికి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇదిలా ఉండగా.. హీరోయిన్లను అందంగా చూపించడంలో కృష్ణవంశీ మార్క్ వేరు అని పేరుంది. మీ సినిమాలలో హీరోయిన్స్ ఎందుకు అంత అందంగా ఉంటారు? బాపు బొమ్మలా కనిపిస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. “నేను హీరోయిన్లను అందంగా చూపిస్తానని అంటుంటారు. కానీ.. నేనసలు వారిపై దృష్టి పెట్టను. ఎందుకంటే.. హీరోయిన్స్ ఆల్రెడీ దేవకన్యల్లా ఉంటారు. ఇంకా వాళ్ళను నేను అందంగా చూపించేది ఏముంది. మామూలుగానే వారంతా అందగెత్తెలు. కెమెరా యాంగిల్స్ బట్టి వారు మరింత అందంగా కనిపిస్తారేమో” అంటూ షాకిచ్చారు కృష్ణవంశీ. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే రంగమార్తాండ ప్రేక్షకుల ముందుకు రానుంది.