బలగం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ల పరంగానే కాక.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఇక తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీమ్. కారణం
బలగం.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అనూహ్య రీతిలో భారీ విజయం సాధించింది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు రెండు.. చావు, పుట్టుక. ఈ భూమ్మీదకు ఒక జీవి వస్తే.. ఎంత సంబరపడతామో.. అదే జీవి.. మృతి చెందితే.. అంతకు రెట్టింపు బాధపడతారు. చావు, దాని చుట్టూ అల్లుకుని ఉన్న సంప్రదాయాలు, ఆ సమయంలో చోటు చేసుకునే భావోద్వేగాలు.. వీటన్నింటిని మేళవించి.. తెరకెక్కించిన బలగం.. బలమైన హిట్ కొట్టింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సన్నివేశంతో కనెక్ట్ అవుతారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఒగ్గు కథ విని ఏడవని జనాలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాలు ఈ సినిమాలో లీనం అవుతున్నారు. కేవలం థియేటర్‌లోనే కాక.. ఊర్లలో కూడా బలగం సినిమా ప్రభావం బలంగా ఉంది. గ్రామాల్లో ఏకంగా పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి.. ఊరంతా ఒక్క చోటకు చేరి.. సినిమాను చూస్తున్నారంటే.. బలగం.. జనాల మదిపై ఎంత బలమైన ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
తమ సినిమాకు ఈ రేంజ్‌లో గుర్తింపు వస్తే.. ఏ దర్శకుడు అయినా, నిర్మాత అయినా సరే.. సంతోషిస్తాడు. కానీ తాజాగా దిల్ రాజు మాత్రం బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారణం బలగం సినిమాను ఊరిలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం. ఇలా చేయడం నేరమని అంటున్నాడు దిల్ రాజు. థియేటర్లో సూపర్ హిట్ మాత్రమే కాక.. భారీగా వసూళ్లు సాధించిన బలగం.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు సినిమాను డౌన్ లోడ్ చేసి.. గ్రామంలో తెరలు కట్టి.. ఊరంతా చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇలా చేయడం నేరం అంటున్నాడు దిల్ రాజు.
బలగం సినిమాను కాపీ చేసి ఊరూరా తెరలు కట్టి ప్రదర్శించడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని ఆరోపించాడు దిల్ రాజు. ఇలా సినిమాను కాపీ చేసి ప్రదర్శిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొవాలని.. అలాంటి ప్రదర్శనలు నిలిపివేయాలని కోరుతూ నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించింది దిల్ రాజు టీమ్. తమ అనుమతి లేకుండా ఇలా బలగం సినిమా ప్రదర్శిస్తున్న వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్. ఇలా బలగం సినిమాను ప్రదర్శిస్తున్న వారిపై పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని వారు కోరారు. ప్రస్తుతం ఈ పోలీస్ కంప్లైంట్ కి సంబంధించిన లెటర్ నెట్టింట వైరల్ గా మారింది.
సుమారు 15-20 ఏళ్ల క్రితం గ్రామాల్లో ఇలా పెద్ద తెరను ఏర్పాటు చేసి సినిమాలు ప్రదర్శించేవారు. థియేటర్‌కు వెళ్లలేని వారికి ఇలా గ్రామాల్లో పెద్ద తెర మీద సినిమా చూడటం.. మధురమైన జ్ఞాపకం. అలాంటి సీన్ ఇప్పుడు బలగం సినిమా విడుదల తర్వాత మళ్లీ కనిపించడం విశేషం. కానీ ఇదే అంశం మీద సినిమా ప్రొడక్షన్ యూనిట్‌కి నష్టం చేకూర్చుతోందని దిల్ రాజు టీమ్ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. మరి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక కమెడియన్‌గా, జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు.. తొలి సారి దర్శకుడిగా మారి.. ఇటు కామెడీ.. అటు ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ తీసిన ఈ బలగం మూవీ ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. కుటుంబ విలువలతో పాటు మోడ్రన్ సమాజం పోకడ జనానికి తెలిసేలా బలమైన ఎమోషన్స్‌తో తెరకెక్కింది ఈ చిత్రం. థియేటర్లలో ఇంకా ఆడుతున్న ఈ బలగం.. అటు ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రతి గ్రామంలో కూడా బలగం సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమా చూసి ఎంతో మంది భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవి చాలు బలగం సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యిందో చెప్పడానికి.
థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించిన బలగం సినిమాకు అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి. తొలుత ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు అందుకుంది బలగం చిత్రం. ఆ తర్వాత రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అదేవిధంగా ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది ఈ బలగం. మరి ఇంత గుర్తింపు తెచ్చుకున్న చిత్రం మీద.. దిల్ రాజు ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.