టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చకున్నాడు దిల్ రాజు. ఆయన ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడన్నా.. ఏదైనా సినిమాను తన బ్యానర్‌లో విడుదల చేస్తున్నాడన్నా.. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఓ నమ్మకం. సినిమాల విషయంలో దిల్ రాజు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఆయనకు సక్సెస్‌నే అందించాయి. నిర్మాతగా ఆయన ఎంత విజయం సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం దిల్‌రాజుపై టాలీవుడ్‌లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అది వారసుడు సినిమా విషయంలో. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న వారసుడు చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో వారసుడు సినిమాను సంక్రాతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారని టాక్.
దాంతో దిల్‌రాజుపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు మెగా, నందమూరి అభిమానులు ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. టాలీవుడ్‌లో సంక్రాతికి పెద్ద హీరోలు చిత్రాలు సందడి చేస్తాయి. ఆ నెల అంతా.. చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు విడుదల కావు. అలాంటిది దిల్ రాజు.. వారసుడు సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉండటమేకాక.. సినిమా కోసం ఆంధ్ర, నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున థియేటర్లు బుక్ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో దిల్‌రాజుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో వారసుడు విడుదల వివాదంపై తాజాగా స్పందించారు దిల్ రాజు. మసూద సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న దిల్ రాజు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘మసూద సినిమాపై దర్శకుడికి ఎంతో నమ్మకం ఉంది. సినిమా ఎవరికి నచ్చకపోయినా.. అంతే ధైర్యంతో విడుదల చేశాడు. సినిమా మీద తనకున్న ప్యాషన్ అది. దర్శకుడిలోని ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. అందుకే అతడికి మద్దతిచ్చాను. నా గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. కానీ నాలో మరో యాంగిల్ ఉంది. అది ఎవరికి తెలియదు. సినిమాను ప్రేమించి.. మంచి కంటెంట్‌తో సినిమాలు తీసేవాళ్ల కోసం నేను ఏం చేయ్యడానికి అయినా రెడీ. అందుకే మసూదకు మద్దతిచ్చాను’’అన్నాడు.
‘‘మంచి సినిమా చేస్తే.. దాని కోసం ఏం చేయ్యడానికైనా నేను రెడీ. ఒక అద్భుతమైన సినిమా మన వాళ్లకి చూపిద్దాం అని ఎప్పుడు ఆలోచిస్తుంటాను. అందుకే లవ్ టుడే రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్‌తో విడుదల చేస్తున్నాను. నాకు డబ్బులు వద్దు.. అయినా డబ్బులతో ఏం చేసుకుంటాం. చివరకు మిగిలేది ఏంటి. మనందరకి తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆలోచిస్తాను. అలానే వారిసు థియేటర్స్ వివాదం గురించి త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుందో వివరాస్తాను’’ అన్నాడు.