ప్రతిభకు వయసు, పేదరికం అడ్డుకాదు అంటారు. చాలా మంది ఈ మాటలు నిజం చేసి చూపారు కూడా. అన్ని అవకాశాలుండి.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. చాలా మంది కష్టపడి బతకడానికి ఇష్టపడరు. కానీ మరి కొందరు కుటుంబ పోషణకోసం రోజంతా కష్టపడి పని చేస్తూనే.. తమ కల నేరవేర్చుకోడం కోసం శ్రమిస్తారు. అనుకున్నది సాధించి చూపుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వర్షా బుమ్రా. పొట్ట కూటి కోసం కూలీ పని చేస్తూనే.. తనకెంతో ఇష్టమైన డాన్స్‌ని సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ.. ఏకంగా డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్స్ వంటి ప్రతిష్టాత్మక షోలో విజేతగా నిలిచి.. రికార్డు సృష్టించింది వర్షా బుమ్రా. ఆసక్తి, నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపించింది. వర్షా బుమ్రా. ఆమె సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు..
హరియాణాకు చెందిన వర్షా బుమ్రాది నిరుపేద కుటుంబం. పదిహేడేళ్ల వయసులో ఆమెకు వివాహం అయ్యింది. భర్త భవన నిర్మాణ రంగంలో పని చేసేవాడు. కుటుంబ పోషణ కోసం తాను కూడా భర్తతో కలిసి పని చేయడానికి వెళ్లేది వర్షా బుమ్రా. ఆమెకు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వర్షకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. డాన్స్ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతలు కూడా గెల్చుకుంది. అయితే వివాహం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భర్త, కుటుంబ పోషణ ఇవే ముఖ్యం అయ్యాయి. అయితే మనసులో డాన్స్ పట్ల ఇష్టం మాత్రం పోలేదు.
ఈ క్రమంలో ఓ రోజు తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో భర్తకు చెప్పింది వర్ష. ఆమె ప్రతిభ చూసి.. వర్షను ప్రొత్సాహించడం ప్రారంభించాడు. దాంతో.. సమయం దొరికనప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేసేది వర్ష. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ వర్తికా ఝా డాన్స్ వీడియోలను చూసి.. తనలో కసి పెంచుకుంది వర్ష. ఆమెలా తాను కూడా డాన్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో డాన్స్ వీడియోలు చూస్తూ.. ప్రాక్టీస్ చేయసాగింది.
అలా సొంతంగా ఎన్నో రకాల డాన్స్ స్టెప్స్ నేర్చుకుంది వర్ష. ఈక్రమంలో ఆమెకు డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మాప్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. దానిలో పాల్గొన్నది. ఆడిషన్స్‌లో వారిని మెప్పించి.. డాన్స్ షోకి ఎంపికయ్యింది. దీంతో కూలిపనికి వెళ్లడం మానేసి.. పూర్తి సమయాన్ని డాన్స్‌కే కేటాయించింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న వర్ష.. అందుకోసం తీవ్రంగా శ్రమించింది. తనతో పోటీ పడ్డవారిని వెనక్కి నెట్టి.. ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. అందరిని ఓడించి టైటిల్ గెలుచుకుంది. కొన్నాళ్ల క్రితం వరకు సిమెంట్, ఇటుకలు మోసిన ఆమె.. నేడు డాన్స్ ట్రోఫీని గెలుచుకుని రావడంతో.. ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. వర్ష ఊరి ప్రజలు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారామెకు.
షోలో గెలవడం వల్ల వర్షకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు న్యాయ నిర్ణేతల నుంచి కొంత మొత్తం, స్పాన్సర్స్ నుంచి మరి కొంత.. ఇలా మొత్తం 10 లక్షల రూపాయలు లభించాయి. ఒకప్పుడు రోజుకు కేవలం ఐదు వందల రూపాయల లోపు సంపాదించే వర్ష.. ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలు ఒకేసారి గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘జీవితంలో లక్ష రూపాయలు సంపాదిస్తానని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది ఈ రోజు నేను ఇన్ని లక్షల రూపాయలు గెలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. నా కొడుక్కి మంచి జీవితం ఇవ్వడమే నా ముందున్న ఏకైక లక్ష్యం. షోకి వచ్చిన వారంతా నా కొడుకు చదువుకయ్యే ఖర్చు భరిస్తామని మాట ఇచ్చారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారి సాయాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఇక ఇప్పటివరకు మాకంటూ సొంత ఇల్లు లేదు. నాకు వచ్చిన డబ్బుతో కొంత మొత్తం వెచ్చింది చిన్న ఇల్లు కొనుక్కుంటాను’’ అని తెలిపింది వర్ష. ఆమె సాధించిన విజయం చూసి చాలా మంది వర్షపై ప్రశంసలు కురిపిస్తున్నారు.