నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఎన్నో సినిమాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. చిన్న మాటలతోనే హాస్యాన్ని పుట్టిస్తారు. చిన్నప్పుడు నాటకాలు వేసిన ప్రభావంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వెండితెరకు వచ్చారు. తనయుడు రవి బ్రహ్మతేజ.. ఇంటర్వ్యూలో పాల్గొని తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో ఒకరు దివంగత నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఎన్నో సినిమాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. చిన్న మాటలతోనే హాస్యాన్ని పుట్టిస్తారు. చిన్నప్పుడు నాటకాలు వేసిన ప్రభావంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశాడు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వెండితెరకు వచ్చారు. దూరదర్శన్ లో తొలి తెలుగు సీరియల్ అనగనగా ఒక శోభను ప్రారంభించారు. ఆ తరువాత మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానందయ్య శిష్యుల కథ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో వచ్చి తనదైన హాస్యాన్ని పండించారు. అయితే 2013లో కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
కాగా, ఆయన తనయుడు రవి బ్రహ్మతేజ.. ఇంటర్వ్యూలో పాల్గొని తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆయనలో ఎంత బాధ ఉన్నా చెప్పరు. ఫెయిల్యూర్ గురించి అస్సలు మాట్లాడేవారు కాదు. ఆయనకో రూమ్ ఉండేది. అందులో ఎక్కువ స్పెండ్ చేసేవారు. ఒకవేళ బాధ అనిపించి ఉంటే అక్కడ బాధపడ్డారేమో. ఆయనకు కూడా కష్టాలుంటాయి. ఆయన చనిపోయే దాకా ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది పడలా.ఇప్పటికి మేమంతా సంతోషంగా ఉన్నామంటే ఆయన సంపాదించిన ఆస్తే. మా మదర్ బ్యాలెన్స్ గా సంసారాన్ని లాక్కొచ్చింది. మా నాన్న చనిపోయాక.. స్టేబుల్ గా ఉన్నామంటే మదరే కారణం . ఆమెనే మాకు బాక్ బోన్’అని వ్యాఖ్యానించారు.
‘2001లో ‘నువ్వు నేను’ సక్సెస్ సందర్భంగా ఉదయ్ కిరణ్ ఇచ్చిన పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో వనస్థలి పురంలో నాన్నకు యాక్సిడెంట్ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కి దిగింది. పొద్దున ఎవరో చూసి.. అతను కాపాడి.. నాన్నను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన బతికిబట్టకట్టారు. ఆ సమయంలో నాన్నకు కుడి చేతికి సర్జరీ చేసి రాడ్ వేశారు. నాన్న తలపై 21 కుట్లు పడ్డాయి. అయినా బయట పడ్డారు. అప్పుడు మా అమ్మ పక్కనే ఉండి అన్ని చూసుకుంది. ఆ సమయంలో అందరూ వచ్చారు. బ్రహ్మనందం గారు వచ్చి కూడా మా అన్నకు మంచిగా ట్రీట్ మెంట్ చేయండి. ఆయన త్వరగా కోలుకొని.. తిరిగి సినిమాలు చేయాలి అని అన్నారు’అని తెలిపారు .
‘2003-04లో సౌందర్య శ్వేతనాగు మూవీ కోసం బెంగళూరు వెళ్లారు. పస్ట్ టైమ్ అమ్మను బెంగళూరు తీసుకెళ్లారు. ఫారెస్టులో షూటింగ్.. అయిపోయాక, తలనొప్పి ఉందని కాఫీ ఆర్డర్ చేశారు. లోపలికి వెళ్లారు. గంటైనా రాలేదు. తీరా చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నారు. ఆసుపత్రికి తీసుకెళితే.. స్మోకింగ్ వల్ల మొత్తం లివర్ దెబ్బతిందని చెప్పారు. పదిరోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండుసార్లు నాన్నను కాపాడుకున్నాం, కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం’అని చెప్పారు. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ అని చెప్పారు.
‘11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. బ్రహ్మానందం నాన్నకు తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూస్తే తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు, నేనే వస్తా, మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7న ఆయన చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు బ్రహ్మానందం ఇంటికి రాలేదు కానీ ఫిలించాంబర్‌లో చాలా ఏడ్చారు’ అని చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తేజ. ధర్మవరపు సుబ్రమణ్యం లెక్చరర్ పాత్రలో చాలా సినిమాల్లో మెప్పించారు. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. అంటూ వ్యాఖ్యలు ఆయనకే చెల్లుతాయి. ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కామెడీ పండించిన ఆయన యజ్ఞం, ఆలస్యం అమృతం సినిమాలకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డులు అందుకున్నారు. ఆయన గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.