మసూద.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. సినిమాల్లో హారర్ జానర్‌కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. లారెన్స్ లాంటి వాళ్లు కాంచన సిరీస్ తీస్తున్నారు అంటే అందుకు అదే కారణం. చాలాకాలంగా సరైన హారర్ చిత్రం పడక అభిమానులు అంతా డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మసూద చిత్రం విడుదలైన తర్వాత వారికి ఆ వెలితి పూరించినట్లు అయ్యింది. ఇంకేముంది ఈ సినిమాకే అంతా క్యూ కడుతున్నారు. ట్రైలర్‌తో వచ్చిన అంచనా.. సినిమా విడుదలైన తర్వాత మౌత్ టాక్‌తో నెక్ట్స్ లెవల్‌కి చేరింది. మొదట్లో తీసుకున్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది.
ఈ సినిమా విషయానికి వస్తే.. నీలమ్ (సంగీత), నజియా(భాందవి) తల్లీ కూతుళ్లు. ఆర్థికంగా మధ్య తరగతి కంటే తక్కువ కుటుంబం అనమాట. చేతిలో డబ్బులేకపోయినా.. అద్దె ఇంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. తలుపు తట్టిన కష్టాలను చూసి బెదిరిపోకుండా.. అవి మాకు మామూలే అంటూ సర్ధుకుపోతుంటారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్నాళ్లకు నజియా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆమె ప్రవర్తన చూస్తే దెయ్యం పట్టినట్లు అనిపిస్తుంది. పొరుగింటి గోపి(తిరువీర్) సహాయంతో నజియాను బాగు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు ‘మసూద’ అనే అమ్మాయి గురించి తెలుసుకుంటారు. అసలు ఎవరా మసూద? అనేదే ఈ సినిమా కథ.
సినిమాలో ఎంతో కీలకమైన మసూద పాత్రను బుర్కాలోనే చూపిస్తారు. అయితే తొలిసారి మసూదను ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా సాధించిన సక్సెస్‌ని ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు.. థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మసూదను పరిచయం చేశారు. మసూద పాత్ర చేసిన ఆమె పేరు అఖిలా రామ్. ఆమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. హిందీలో ‘లిఫ్ట్ 8055’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ చిత్రం MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు అఖిలా రామ్‌ని బుర్కా లేకుండా చూసిన ఫ్యాన్స్ అంతా తెగ ఆనందపడిపోతున్నారు. మరోవైపు డైరెక్టర్‌పై కాస్త కోపంగా కూడా ఉన్నారు. ఇంత అందంగా ఉన్న అమ్మాయికి బుర్కా ఎలా వేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, వివరాల కోసం తెగ వెతుకులాట ప్రారంభించారు.
ఈ థాంక్యూ మీట్ లో అఖిలా రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. “సినిమా కథ చెప్పినప్పుడు డైరెక్టర్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నీ క్యారెక్టర్ బ్యాట్ మ్యాన్ మిత్ మాస్క్ అని చెప్పారు. సినిమా మొత్తం నా ఫేస్ చూపించరు అని చెప్పినా కూడా అందుకే ఒప్పుకున్నాను. ఈ సినిమాని చాలా పెద్ద సక్సెస్ చేశారు. మసూద కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా పెద్ద థ్యాంక్స్. శుభలేఖల సుధాకర్ గారితో ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్, డీవోపీ, మ్యూజిక్ ఇలా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ అఖిలా రామ్ వ్యాఖ్యానించింది.