డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం.. ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అతడి సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్యాన్స్ మాస్టార్ చైతన్య.. ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చైతన్య. అప్పుల బాధలు భరించలేకనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు చైతన్య. అప్పుల తీర్చే సత్తా తనకు ఉందని.. కానీ ఒత్తిడి భరించలేక పోతున్నాను అంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు చైతన్య. అతడి మృతి పట్ల శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్, యాంకర్ రష్మితో పాటు ఇతర డ్యాన్సర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అసలు చైతన్యకు అప్పులు ఉన్నాయనే విషయమే తమకు ఇంత వరకు తెలియదు అంటున్నారు.
ఇక చైతన్య మృతి గురించి తెలిసిన తర్వాత ఢీ కంటెస్టెంట్లు, ఆయన సన్నిహితులు విచారం వ్యక్తం చేయడం మాత్రమే కాక.. అప్పుల వల్ల చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే నమ్మలేకపోతున్నాం అంటున్నారు. అసలు చైతన్యకు అప్పులు ఉన్నాయనే విషయమే తమకు తెలియదంటున్నారు. దీని గురించి చైతన్య తమతో చర్చిస్తే బాగుండేది. అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని.. సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించేవాళ్లం. తనకు ధైర్యం చెప్పి మద్దతుగా ఉండేవాళ్లం. కానీ చైతన్య తన బాధను మాతో పంచుకోలేదు. తనలో తానే కుంగి పోయి.. చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కండక్టర్ ఝాన్సీ కూడా చైతన్య మృతిపై స్పందిస్తూ.. ‘‘ఓ ఈవెంట్‌కు సంబంధించి ఆర్గనైజర్స్ చైతన్యకు పేమెంట్ ఆపేశారు. అది సుమారు రూ.6-7లక్షల వరకు ఉంటుంది. దాంతో కంటెస్టెంట్లకు డబ్బులు ఇవ్వడం కోసం తాను బయట అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేశాడు. కొందరు డ్యాన్సర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వారందరని కూర్చోబెట్టి.. తన పరిస్థితి వివరిస్తే.. అందరూ అర్థం చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అన్నది.
నేటి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని చూస్తే.. ఇంత చిన్న కారణాలకే ఎందుకు ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపించకమానదు. చైతన్య కూడా ఇదే తప్పు చేశాడు. తన విషయమే తీసుకుంటే.. ఆయన తన పరిస్థితి గురించి ఎవ్వరికి ఏం చెప్పలేదు. తనలో తానే కుమిలిపోయాడు. తనకు డబ్బులు ఆపిన ఆర్గనైజర్స్‌ను గట్టిగా అడగలేకపోయాడు. సమస్యలన్నింటిని తానే భరిస్తూ.. చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదుగుతాడని భావించిన కొడుకు.. ఇలా అర్థాంతరంగా కన్నుమూయడంతో.. చైతన్య తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మరి చైతన్య తీసుకున్న నిర్ణయం సరైందేనా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.