ప్రముఖ నటి ధన్య బాలకృష్ణన్ ఏడాది క్రితం ఓ దర్శకుడిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందంటూ నటి కల్పికా గణేష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్ ఖాతాలో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. మారి, మారి 2 సినిమాలు తీసిన తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ను ధన్య ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుందని ఆమె అన్నారు. భార్యతో విడాకులు తీసుకున్న బాలాజీ మోహన్‌కు ఇది రెండో పెళ్లని కూడా కల్పిక పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ఆ వీడియో ఉన్నట్టుండి కల్పిక యూట్యూబ్ ఖాతాలోంచి కనిపించకుండా పోయింది. ఆ వీడియో కనిపించకుండా పోవటానికి ధన్యనే కారణమంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన్యపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘‘ ఇన్నాళ్లు నువ్వు నా ఫోన్‌ను బ్లాక్ చేసి ఉంచావు. నీకు సంబంధించిన విషయాలు బయటపెట్టేసరికి అన్‌బ్లాక్ చేశావు. రాత్రి వరుసగా కాల్స్ చేశావు. ఏం చేసుకుంటావో చేసుకో.. నీ పవర్ చూపించి నా వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించావు. నా పవర్ చూపిస్తే భస్మమైపోతావు. కోలీవుడ్ స్టార్ హీరో అండతో నా వీడియోను డిలీట్ చేయించారు.
అది కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేశారు. అలా ఎలా చేస్తారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుంటాను’’ అని పేర్కొన్నారు. కాగా, కల్సిక గణేష్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమటంపై కూడా కల్పిక విమర్శలు చేశారు. తనను ఓ సినిమా షూటింగ్ సమయంలో అతడు ఐటమ్ అన్నాడన్నారు. అభినవ్ తనకు క్షమాపణ చెప్పకపోతే దానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. అయితే, అభినవ్ దీనిపై స్పందిచకపోవటంతో వివాదం మరుగున పడిపోయింది.